సెప్టంబర్ నుంచి అకడమిక్ ఇయర్ స్టార్ట్… యూజీసీ కీలక నిర్ణయం..?

2020-21 విద్యాసంవ‌త్స‌రానికి సంబంధించి యూజీసీ సదీర్ఘంగా చర్చిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ నుంచి ప్రారంభించే అవ‌కాశాల‌పై యూనివ‌ర్సిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ ప‌రిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కోవిడ్‌-19 వ్యాప్తితో మార్చి 16వ తేదీ నుంచి దేశ‌వ్యాప్తంగా అన్ని విద్యాల‌యాలు, యూనివ‌ర్సిటీల‌కు సెల‌వులు ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. దీంతో ప్రాథ‌మిక‌, ప్రాథ‌మికోన్న‌త పాఠ‌శాల‌ల‌కు సంబంధించి 2019-20 విద్యా సంవ‌త్స‌రం దాదాపు ముగిసిన‌ట్లుగానే చెప్పవచ్చు. అయితే అన్ని రాష్ట్రాల్లో 9వ త‌ర‌గ‌తి వ‌ర‌కు విద్యార్థుల‌ను త‌ర్వాతి త‌ర‌గతుల‌కు ప్ర‌మోట్ చేశారు. ప‌దోత‌ర‌గ‌తి విద్యార్థుల ప‌రీక్ష‌ల‌పై నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది. ఇక ఉన్న‌త‌, వృత్తి విద్యాకోర్సుల్లో ఉన్న‌వారికి ఆన్ లైన్ విధానం ద్వారా త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే.

కాగా కరోనా వైర‌స్ తీవ్రంగా విజృంభిస్తుండటంతో కొత్త విద్యా సంవ‌త్స‌రం ఎప్ప‌టినుంచి ప్రారంభించాలి అనే దానిపై ప‌రిశీల‌న జ‌రిపేందుకు యూజీసీ రెండు క‌మిటీల‌ను ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీలు శుక్ర‌వారం త‌మ‌త‌మ నివేదిక‌ల‌ను అందించాయి.

కాగా హ‌ర్యానా యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ ఆర్.సీ.కుహాడ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన క‌మిటీ లాక్ డౌన్ తో విద్యార్థుల‌కు ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ అంశంపై అధ్య‌య‌నం చేసి నివేదిక ఇచ్చింది. ఇందిరాగాంధీ నేష‌న‌ల్ ఓపెన్ యూనివ‌ర్సిటీ (ఇగ్నో) వైస్ ఛాన్స‌ల‌ర్ నాగేశ్వ‌ర‌రావు నేతృత్వంలో ఏర్పాటుచేసిన క‌మిటీ ఆన్ లైన్ విద్యా విధానం, మార్పులు-చేర్పులు, తీసుకోవాల్సిన చ‌ర్య‌లు వంటి అంశాల‌పై అధ్య‌య‌నం చేసింది. ఈ రెండు క‌మిటీలు ఇచ్చిన నివేదిక‌ల‌ను అనుస‌రించి, పూర్తిస్థాయి ప‌రిశీల‌న జ‌రిపి ఓ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఈ క‌మిటీలు ముఖ్య‌మైన అంశాలను గురించి కూడా ప్రస్తావించించింది.

అంతేకాకుండా జాతీయ‌స్థాయి ప్ర‌వేశ‌ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌, ఆన్ లైన్ ద్వారా ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు ఆయా కాలేజీ యాజ‌మాన్యాలకు అందుబాటులో ఉన్న సాంకేతిక అంశాలపై కూడా చర్చించారు. జేఈఈ, నీట్ వంటి ప్ర‌వేశ‌ప‌రీక్ష‌లు జూన్‌లో నిర్వ‌హించ‌ వ‌చ్చ‌ని దీంతో విద్యాసంవ‌త్స‌రం ప్రారంభ‌మ‌య్యేనాటికి ఇబ్బంది ఉండ‌ద‌ని ఆర్ సీ కుహాడ్ క‌మిటీ తెలిపింది. అయితే ఇది క‌రోనా వైర‌స్ వ్యాప్తిని కూడా దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన నిర్ణ‌య‌మ‌ని తెలిపింది. వృత్తివిద్యా కోర్సుల‌కు సంబంధించి ఇప్ప‌టికే ఆన్ లైన్ ద్వారా త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్నారు. సీబీఎస్ఈ బోర్డు మాత్రం 29 స‌బ్జెక్టుల్లో మాత్రం విద్యార్థుల‌కు ప‌రీక్ష నిర్వ‌హించి అందులో ఉత్తీర్ణ‌త సాధిస్తేనే త‌ర్వాతి తర‌గ‌తికి ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. దీంతో యూజీసీ ఈ క‌మిటీలు ఇచ్చిన నివేదిక‌లను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఓ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వచ్చే విద్యా సంవ‌త్స‌రం జూన్ నుంచి ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం మాత్రం క‌నిపించ‌డం లేదు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.