కాళ్లు రంగుమారడం, వాపు, మచ్చలు రావడం కూడా కరోనా లక్షణాలే

విశ్వాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ లక్షణాలను ఇప్పటివరకు జలుబు, దగ్గు, జ్వరం వంటి వాటినే వైద్య నిపుణులు గుర్తించారు. అయితే.. వీటికి తోడు మరికొన్ని లక్షణాలను కూడా కరోనాకు సంకేతంగా చెప్తున్నారు. ఆకలి మందగించడం, వికారం, జ్వరం, జలుబు, దగ్గు, తీవ్రమైన ఒళ్లు నొప్పులు వంటి ప్రధాన లక్షణాలు కరోనా వైరస్ సోకిన వ్యక్తుల్లో కనిపిస్తున్నాయి. మెజార్టీ కేసుల్లో ఇవే లక్షణాలు బయటపడతున్నాయని చెప్తున్నారు.

అదేవిధంగా తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా లక్షణాలను యువకుల్లో గుర్తించడానికి వారి కాలి వేళ్లను పరిశీలించాలని ఐరోపా.. అమెరికా వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు. ఎందుకంటే… కరోనా సంక్రమించినవారికి పైలక్షణాలతోపాటు పాదాలు, బొటనవేళ్లకు వాపులు, కందిపోయినట్లు ఉబ్బిపోవడం, రంగు మారడం వంటివి కూడా సమక్రమిస్తున్నాయి. ఆ తర్వాత ఒకటి రెండు రోజులకు కరోనా వైరస్ బారినపడుతున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా వాపులు, రంగు మారినవారి కాళ్లను తాకగానే చాలా బాధతో విలవిలలాడిపోతారని పెన్సుల్వేనియా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌ అంటువ్యాధుల విభాగం హెడ్ డాక్టర్ ఎబ్బింగ్ లౌటున్‌బచ్ తెలిపారు. కరోనా బాధితుల్లో చర్మానికి సంబంధించిన మార్పులు బయటపడినట్టు ఇటలీ వైద్యులు తెలిపారు. తమ వద్దకు వచ్చిన ఐదుగురు రోగులలో ఒకరికి చర్మ సమస్య ఉందని గుర్తించారు. కరోనా వైరస్ సోకినవారికి కాళ్లు సాధారణంగా ఎరుపు లేదా పాలిపోయిన రంగులా కనిపిస్తాయని వెల్లడించారు. వేళ్లపై కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని పెన్సుల్వేనియా వర్సిటీ హాస్పిటల్ డెర్మటాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మిషా రోసేబచ్ స్పష్టం చేశారు. పాదాల రంగు మారడం వాతావరణం సంబంధం లేదని పేర్కొన్నారు.

కాగా తీవ్రంగా కరోనా వైరస్ ప్రభావానికి లోనైన ఇద్దరు చైనీస్ డాక్టర్ల చర్మం నలుపు రంగులోకి మారిపోయింది. తీవ్రంగా అనారోగ్యానికి గురి కావడంతో కాలేయం దెబ్బతినడంతోనే ఇలా జరిగిందని తెలుస్తోంది. జనవరిలో వుహాన్ సెంట్రల్ హాస్పిటల్‌లో కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తోన్న సమయంలో డాక్టర్ యీ ఫాన్, డాక్టర్ హు వియిన్‌ఫెంగ్ కరోనా బారిన పడ్డారు. వీరిద్దరూ లైఫ్ సపోర్ట్ మీద చికిత్స పొందారు. చావు అంచులకు వెళ్లొచ్చిన వారు కోవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ.. వారి చర్మం రంగు మాత్రం నలుపు రంగులోకి మారిపోయింది తెలుస్తోంది.