తాలిబన్లకు కొత్త తలనొప్పులు

తాలిబన్లకు కొత్త తలనొప్పులు

ఆరు నెలలపాటు అఫ్గనిస్థాన్‌లో మీడియా ఛానెల్స్‌ ఏవీ పని చేయబోవని హెచ్చరికలు జారీ చేసింది అఫ్గనిస్థాన్‌ జర్నలిస్ట్‌ అండ్‌ మీడియా ఆర్గనైజేషన్‌ ఫెడరేషన్‌. తక్షణమే మీడియా రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే నిరవధిక సమ్మె తప్పదని హెచ్చరించింది AJMOF. ఇందుకోసం వారం వ్యవధిని డెడ్‌లైన్‌గా ప్రకటించింది. కిందటి ఏడాది ఆగష్టులో తాలిబన్ల ఆక్రమణ తర్వాత.. చాలా రంగాలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా మీడియా ఆర్థికంతో పాటు సమాచార సేకరణలోనూ ఇబ్బందులు పడుతోంది.

‘‘చాలావరకు చానెళ్లు, పేపర్లు, వెబ్‌సైట్‌లు మూతపడ్డాయి. ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకోలేని స్థితికి చేరుకున్నాం. కొందరు వేరే ఉద్యోగాలకు తరలిపోతున్నారు. కవరేజ్‌ సంగతి ఏమోగానీ.. జర్నలిస్టులు తమ కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి దాపురించింది’’ అని ఫెడరేషన్‌ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. తాలిబన్‌ ప్రభుత్వానికి సరైనరీతిలో స్పందించి ఉంటే.. ఇప్పుడు ఈ మీడియా రంగం సంక్షోభం ఎదుర్కొనేది కాదని ఫెడరేషన్‌ అభిప్రాయపడుతోంది. నిధుల అవకతవకలతో పాటు కమ్యూనికేషన్‌ రంగం కుదేలు కావడానికి తాలిబన్లు తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆరోపిస్తున్నారు జర్నలిస్టులు. పనిలో పనిగా ఈయూ మానవతా దృక్ఫథంతో అందించబోయే సాయం నుంచి తమకు తోడ్పాటు ఇవ్వాలని కోరుతున్నారు.