షూటింగ్‌లో గాయపడ్డ తమిళ హీరో అజిత్‌ కుమార్‌

షూటింగ్‌లో గాయపడ్డ తమిళ హీరో అజిత్‌ కుమార్‌

తమిళ హీరో అజిత్‌ కుమార్‌ షూటింగ్‌లో గాయపడ్డాడు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ హీరో వినోద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వలిమై’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చెన్నైలో చిత్రీకరిస్తున్నారు. అందులో భాగంగా హీరో బైక్‌ చేజ్‌ సీన్‌ను చిత్రీకరించే సమయంలో అజిత్‌ అదుపు తప్పి బైక్‌ మీద నుంచి కిందపడ్డాడు. దీంతో ఆయన కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. అయినప్పటికీ అజిత్‌ అవేమీ పట్టించుకోకుండా కాసేపు విరామం తీసుకున్న అనంతరం తిరిగి షూటింగ్‌లో పాల్గొని ఆ సన్నివేశాన్ని పూర్తి చేసినట్లు సమాచారం. ఇక షూటింగ్‌ ముగిసిన అనంతరం ఆసుపత్రిలో చికిత్స తీసుకోగా.. వైద్యులు కొద్దిరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. (అజిత్‌కు జంటగా తలైవా ప్రేయసి)

ఎలాంటి డూప్‌లు లేకుండా రియల్‌ స్టంట్‌ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం నుంచి అతడు స్వల్ప గాయాలతో బయటపడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అజిత్‌ త్వరగా కోలుకోవాలంటూ సోషల్‌ మీడియాలో ప్రార్థిస్తున్నారు. దీంతో ప్రస్తుతం #GetWellSoonTHALA అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ‘మీరు ఆరోగ్యంగా ఉండటమే మాకు కావాల్సింది. మిగతావన్నీ వాటి తర్వాతే’ ‘కోలుకున్న తర్వాత మరింత ఎనర్జీతో తిరిగి రావాలి’ అని అభిమానులు కోరుకుంటున్నారు.