అసెంబ్లీలో అంబటి వర్సెస్ అచ్చెన్నాయుడు

ambati verses atchennayudu in assembly

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై చర్చలో అంబటి రాంబాబు, అచ్చెన్నాయుడు మధ్య వాడివేడి చర్చ జరిగింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన వారి గురించి అంబటి ప్రస్తావిస్తూ, “గెలిచేది తామేనని, రాసుకో రాసుకో రాసుకో… అని చెప్పిన వారెవరూ ఇక్కడ లేరు. ఒక్క ఆచ్చెన్నాయుడే ఉన్నారు. ఆయనా రేపుండరు” అనగా, దీనికి అచ్చెన్నాయుడు తీవ్ర అభ్యంతరం లేవనెత్తారు. ప్రజాస్వామ్యంలో ఓటమి సర్వసాధారణమని, ఓటమి పాలైన వారు అసమర్థులు కారని అన్నారు. అంబటి రాంబాబు కూడా వరుసగా ఎన్నికల్లో ఓడిపోతూ వచ్చి, ఇప్పుడు గెలిచారని గుర్తు చేశారు. సభలో లేనివారి పేర్లు ప్రస్తావించడం ఎందుకని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన అంబటి, ఓడిన వారు అసమర్థులు కారని అనుకోవడం ఓ ఓదార్పు వంటిదని, టీడీపీ నేతలు తమను తాము ఓదార్చుకునేందుకు ఇలాంటి మాటలంటున్నారని, ఓటమి ఓటమేనని అన్నారు. ప్రజలు చంద్రబాబును తిరస్కరించారని, ఈ విషయాన్ని అంగీకరించాల్సిందేనని అన్నారు. ఆ సమయంలో మరోసారి అచ్చెన్నాయుడు కల్పించుకోబోగా, “ఐదుసార్లు గెలిచిన నాయుడుగారు రెండుసార్లు గెలిచిన రాంబాబుకు అడ్డం వస్తే ఎలా అధ్యక్షా?” అని చమత్కరించారు.