అవంతి ఆగ్రహం కూడా బాబు వ్యూహమేనా?

Anakapalli MP Avanthi Srinivas fires on Modi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ కి కోపం కొత్త ఏమీ కాదు. అయితే ఈసారి ఆయన ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వ స్టీరింగ్ పట్టుకున్న బీజేపీ ని ఏకిపారేశారు. విభజన సమయం మొదలుకుని నాటి హామీల విషయంలో కూడా కాంగ్రెస్ కి ఎంత పాపం వుందో అంత కన్నా ఎక్కువ కోపం ఇప్పుడు ఆంధ్రప్రజలకు బీజేపీ మీద ఉందని తేల్చేశారు. పైగా ఇదంతా సీఎం చంద్రబాబు సమక్షంలో జరుగుతున్న సమావేశం లో జరిగిన ఎపిసోడ్. టీడీపీ లో 30 ఏళ్ళ కు పైగా బాబుతో కలిసి నడిచిన సీనియర్ నేతలే ఆయన ముందు కోపంగా మాట్లాడాలంటే జంకుతారు. అలాంటిది 2014 ఎన్నికల ముందే పార్టీలో చేరి ఎంపీ అయిపోయిన అవంతి శ్రీనివాస్ దూకుడు చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. అంత కన్నా దానికి బాబు రియాక్షన్ ఇంకా ఆశ్చర్యం కలిగించింది.

కేంద్ర ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టిన అవంతి శ్రీనివాస్ గురించి బాబు ఒక్క మాట కూడా అనలేదు. పైగా అవంతి లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు సమాధానం అన్నట్టు కేంద్ర వైఖరి మారకుంటే దండం పెట్టి పక్కకు తప్పుకుందామని బాబు చెప్పిన మాట ఆషామాషీ కాదు. ఇది కేంద్రానికి, బీజేపీ కి, మోడీకి ఓ సంకేతం. ఆ ఊరికి ఈ వూరు ఎంత దూరమో ఈ ఊరుకు ఆ వూరు అంతే దూరం అని లౌక్యంగా చెప్పడం. పార్టీ ప్రతినిధుల సమక్షంలో ప్రజల ఆగ్రహాన్ని ప్రతిబింబించేలా మాట్లాడ్డం. బాబు ఇదంతా ఓ వ్యూహం ప్రకారం చేశారు అనుకుంటే అవంతి కోపం కూడా అందులో భాగం అయ్యుంటుంది. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకుల సందేహం అదే. అయితే ఈ విషయాన్ని ఎలా నిరూపించాలో అర్ధం కావడం లేదు వారికి. అందుకే బాబు మాటలనే టార్గెట్ చేశారు. కమలనాధులు కంప్లైంట్ అనుకున్నారేమో గానీ చంద్రబాబుకు కావాల్సింది అదే. చేరాల్సిన వాళ్లకు విషయం చేరింది. ఇక తమ కోర్టులోకి వచ్చిన బంతిని బీజేపీ, మోడీ ఎటు నెడతారో చూసి చంద్రబాబు ఆట మొదలెడతారు.