ఆనందో బ్రహ్మ… తెలుగు బులెట్ రివ్యూ.

anando brahma movie review

Posted August 18, 2017 at 12:46  
నటీనటులు :   తాప్సి , శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్ , రాజీవ్ కనకాల , వెన్నెల కిషోర్ 
నిర్మాత :   విజయ్ చల్లా , శశిదేవి రెడ్డి 
దర్శకత్వం :    మహి వి రాఘవ్ 
మ్యూజిక్ డైరెక్టర్ :   కె 
ఎడిటర్ :    శర్వాన్ కటికనేని 
సినిమాటోగ్రఫీ : అనీష్ తరుణ్ కుమార్ 

“ఆనందో బ్రహ్మ”…ఈ సినిమాతో చాన్నాళ్ల తర్వాత అందాల నటి తాప్సి మళ్లీ తెలుగు తెర మీద కనిపిస్తున్న సినిమా. తెలుగులో భారీ విజయాలేమీ లేకపోయినా హిందీ లో సక్సెస్ అయ్యాక తాప్సి దక్షిణాదిలో కనిపిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో ఈ మధ్య కాలంలో నమిలి పారేసిన హారర్ కామెడీ ఫార్ములా తో వచ్చిన సినిమా ఆనందోబ్రహ్మ. తాప్సి కి తోడు కామెడీ నటులు కొందరు సందడి చేసిన ఆనందో బ్రహ్మ అంచనాలకు తగ్గట్టు వుందో,లేదో చూద్దామా!

కథ…

ఓ దుర్ఘటనలో రాజీవ్ కనకాల తల్లిదండ్రులు చనిపోవడంతో కథ మొదలు అవుతుంది. దాంతో అప్పటిదాకా వాళ్ళు నివసించిన ఇంటిని అమ్మాలని రాజీవ్ ప్రయత్నిస్తాడు.ఆ ఇంటిలో తాప్సి, ఓ వృద్ధుడు,ఓ చిన్నారి తో కలిసి దెయ్యాలుగా స్థిరపడిపోతారు. దెయ్యాల ఇంటిగా ముద్రపడ్డ ఆ ఇంటిని కొనడానికి ఎవరూ ముందుకు రారు. ఆ ముద్ర పోగొట్టడానికి ఆర్ధిక యిబ్బందులున్న కొందరికి డబ్బు ఆశ చూపి అందులో ఉండేలా ప్లాన్ చేస్తారు. ఆలా శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్ ఆ ఇంటికి చేరతారు. ఆ ఇంటిలో దయ్యాలతో వారికి ఎదురైన అనుభవాలు ఏమిటి ? అసలు తాప్సి దెయ్యమా కాదా ? రాజీవ్ కనకాల తల్లిదండ్రులు ఎందుకు చనిపోయారు అనేది మిగిలిన కథ.

విశ్లేషణ…

ఆనందోబ్రహ్మ అనే పేరు పెట్టుకుని ఓ దయ్యాల కథ చెప్పాలి అనుకోవడం, మనుషుల్ని చూసి దెయ్యాలే భయపడడం వంటి విషయాలు బయటికి వచ్చినప్పుడు ఇదేదో విషయమున్న హారర్ సినిమా అనిపించింది. కానీ సినిమాకి ఆయువు పట్టు లాంటి పాయింట్ పేలవంగా అనిపించడంతో మిగతా వ్యవహారం మీద పెద్దగా ఇంప్రెషన్ లేకుండా పోయింది. సినిమాకి కేంద్రబిందువైన ఇంటిలో జరిగే సీన్స్ కూడా ఎక్కడో చూసినట్టు అనిపిస్తాయి. అయితే అక్కడక్కడా కామెడీ పేలడంతో ఆ లోటు కొంత తీరింది. సినిమాకి కీలకమైన పాయింట్ రెవీల్ అయ్యాక అప్పటిదాకా కలిగిన ఆసక్తి కూడా పోయింది. దీంతో ఆనందో బ్రహ్మ సోసో సినిమాగా మిగిలిపోయింది. సినిమాకి ప్లస్ ఇందులో చేసిన కమెడియన్స్. శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్ బాగా చేశారు. ఈ సినిమాలో వారిని ఎంచుకోవడమే చేసిన మంచి పని. ఇక పింక్ లో తాప్సి నటన చూసి ఆనందో బ్రహ్మ కి వెళితే తప్పకుండా నిరుత్సాహపడతారు. హారర్ జానర్ కి అవసరమైన నటన లో తాప్సి పెద్దగా రాణించలేకపోయింది.

ప్లస్ పాయింట్స్ …

కామెడీ
కమెడియన్స్
రాజీవ్ కనకాల నటన

మైనస్ పాయింట్స్ …

కథతో సహా చాలా .

తెలుగు బులెట్ పంచ్ లైన్…“ఆనందో బ్రహ్మ” పేరుకి మాత్రమే.
తెలుగు బులెట్ రేటింగ్… 2 . 75 / 5 .

SHARE