ఆండ్రూ టైకి ఊహించని షాక్‌

ఆండ్రూ టైకి ఊహించని షాక్‌

బిగ్‌బాష్‌ లీగ్‌ లో పెర్త్‌ స్కార్చర్స్‌ బౌలర్‌ ఆండ్రూ టైకి ఊహించని షాక్‌ తగిలింది. సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆండ్రూ టై బౌలింగ్‌ చేసే సమయంలో రెండు బంతులను బ్యాట్స్‌మన్‌ నడుముపైకి విసిరాడు. క్రికెట్‌ నిబంధనల ప్రకారం బంతులు బ్యాట్స్‌మన్‌ పైకి విసిరితే బీమర్‌ అని పిలుస్తారు. అయితే బీమర్‌ అనేది క్రికెట్‌లో ప్రమాదకరంగా ఉండడంతో దానిని నిషేధించారు.

దీంతో ఒక బౌలర్‌ ఒక ఓవర్‌లో రెండు కంటే ఎక్కువ బీమర్‌లు వేస్తే అతన్ని బౌలింగ్‌ చేయకుండా నిషేధించొచ్చు. ఆండ్రూ టై అదే తప్పు చేశాడు. దీంతో కీలక మ్యాచ్‌లో బౌలింగ్ చేసే అవకాశం కోల్పోయాడు. ఇన్నింగ్స్‌ 15వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ఓవర్‌ నాలుగో బంతిని బ్యాట్స్‌మన్‌ అలెక్స్ రాస్ నడుముపైకి బీమర్‌ వేశాడు. మరుసటి బంతిని వైడ్‌ వేయగా.. ఆ తర్వాత బంతిని మరోసారి బీమర్‌ వేయడంతో అంపైర్లు టైను అడ్డుకొని బౌలింగ్‌ వేయకుండా నివారించారు. ప్రస్తుతం ఆండ్రూ టై బౌలింగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ థండర్స్ జట్టు 20 ఓవర్లలో 200 పరుగుల భారీ స్కోరు చేసింది. సామ్ బిల్లింగ్స్ 35 బంతుల్లో 67 పరుగులు, జాసన్‌ సాంగా 46 బంతుల్లో 56 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన పెర్త్‌ స్కార్చర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి 34 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కొలిన్‌ మున్రో 64 పరుగులు నాటౌట్‌తో రాణించినప్పటికి మిగిలినవారు విఫలమయ్యారు.