అంకితకు మరోసారి నిరాశ

అంకితకు మరోసారి నిరాశ

గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ మెయిన్‌ డ్రాలో ఆడాలనుకున్న భారత మహిళల నంబర్‌వన్‌ క్రీడాకారిణి అంకిత రైనా నిరీక్షణ మరింత కాలం కొనసాగనుంది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో 27 ఏళ్ల అంకితకు మరోసారి నిరాశే ఎదురైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ప్రపంచ 176వ ర్యాంకర్‌ అంకిత 3–6, 2–6తో 22వ సీడ్‌ కురిమి నారా (జపాన్‌) చేతిలో వరుస సెట్లలో ఓటమి పాలైంది. గంటా 21 నిమిషాల పాటు ఈ మ్యాచ్‌ జరిగింది.

‘మ్యాచ్‌లో మరీ చెత్తగా ఆడలేదు. నా ప్రత్యర్థి గొప్పగా ఆడి నా సర్వీస్‌ గేమ్‌ల్ని దక్కించుకుంది. అవి గెలిచుంటే ఫలితం మరోలా ఉండేది. అక్కడ గాలి కూడా ప్రభావం చూపింది’ అని మ్యాచ్‌ అనంతరం అంకిత వ్యాఖ్యానించింది. అంకిత ఓటమితో ఫ్రెంచ్‌ ఓపెన్‌ సింగిల్స్‌ కేటగిరీలో భారత ప్రాతినిధ్యం లేనట్లయింది. ఇప్పటికే పురుషుల సింగిల్స్‌ విభాగంలో సుమీత్‌ నాగల్, రామ్‌కుమార్‌ రామనాథన్, ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ క్వాలిఫయర్స్‌లోనే ఓటమి పాలయ్యారు.