కట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య

కట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య

కట్నం వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని దూసకల్‌ గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నందిగామ మండల కేంద్రానికి చెందిన బొమ్మగల్ల రాములు కూతురు శ్రీజ(20)ను గతేడాది మే 17న ఫరూఖ్‌నగర్‌ మండలం దూసకల్‌ గ్రామానికి చెందిన కల్లెపల్లి శ్రీనివాస్‌ వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో శ్రీజ తల్లిదండ్రులు రూ. 2 లక్షల కట్నం, 8తులాల బంగారం ఇచ్చి ఘనంగా వివాహం చేశారు.

కొంతకాలంగా అదనపు కట్నం తీసుకురావాలని శ్రీజను తన భర్తతోపాటు అత్త, మామ, బావ, తోటి కోడలు మానసికంగా, శారీరకంగా వేధించసాగారు. వేధింపులు తీవ్రమవడంతో ఆమె 3 నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. శ్రీజ తల్లిదండ్రులు నందిగామలో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి అల్లుడు శ్రీనివాస్‌తో పాటు కుటుంబసభ్యులకు నచ్చజెప్పి ఆమెను అత్తగారింటికి పంపించారు. అయినా వారిలో మార్పు రాలేదు. మళ్లీ కట్నం తీసుకురావాలని వేధించసాగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీజ ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తన కూతురు చావుకు భర్త, కుటుంబసభ్యులే కారణమంటూ మృతురాలి తండ్రి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపారు.