అసెంబ్లీ వేదిక‌గా కేంద్రానికి చంద్ర‌బాబు హెచ్చ‌రిక‌

AP CM Warns BJP Government in AP Assembly

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

అసెంబ్లీ వేదిక‌గా విభ‌జ‌న హామీల అమ‌లుపై కేంద్రాన్ని నిల‌దీశారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు. కేంద్రాన్ని తాము అద‌నంగా ఏమీ అడ‌గ‌డం లేద‌ని, విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న హామీలు నెర‌వేర్చ‌మ‌ని మాత్ర‌మే కోరుతున్నామ‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టంచేశారు. రాష్ట్ర ప్రయోజ‌నాల విష‌యంలో రాజీప‌డే ప్ర‌సక్తేలేద‌ని తేల్చిచెప్పారు. రాష్ట్ర బీజేపీ నేత‌లు అన‌వ‌స‌ర మాట‌లు మాట్లాడుతున్నార‌ని, దానికి బ‌దులుగా….ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రానికి ద‌క్కింది ఏమిటో..ఇంకా చేయాల్సిందిఏమిటో కేంద్రానికి వివ‌రిస్తే మంచిద‌ని చంద్ర‌బాబు సూచించారు. ప్ర‌జ‌ల ప‌క్ష‌మే త‌న ప‌క్ష‌మ‌ని, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు, అభివృద్ధే ప్ర‌ధాన ధ్యేయ‌మ‌ని చెప్పారు. మిత్ర‌ప‌క్షం కాబ‌ట్టే సంయ‌మ‌నంతో మాట్లాడుతున్నాన‌ని, లేక‌పోతే ప‌రిస్థితి వేరేలా ఉండేద‌ని ముఖ్య‌మంత్రి వ్యాఖ్యానించారు. ఏపీకి అన్యాయం జ‌రిగింద‌నే బాధ ప్ర‌జ‌లంద‌రిలోనూ ఉంద‌ని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు అన్యాయం చేసింది కాబ‌ట్టే అడ్ర‌స్ లేకుండా పోయింద‌ని…అలాగే బీజేపీ ఎందుకు అన్యాయం చేస్తోంద‌ని నిల‌దీసే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. ఇప్ప‌టివ‌ర‌కు తాను 29 సార్లు ఢిల్లీకి వెళ్లాన‌ని, ప్ర‌జ‌ల మ‌నోభావాలు అర్థం చేసుకోవాల‌ని ప్ర‌ధానికి చెప్పాన‌న్నారు. పోల‌వ‌రానికి అయ్యే మొత్తం ఖర్చును భ‌రిస్తామ‌ని అప్ప‌ట్లో కేంద్ర‌ప్ర‌భుత్వ‌మే చెప్పింద‌ని అన్నారు. పోల‌వ‌రం భూసేక‌ర‌ణ‌కు రూ. 32వేల కోట్లు అవుతోంద‌ని, పోల‌వ‌రం కోసం రాష్ట్రం పెట్టిన ఖ‌ర్చులో ఇంకా రూ. 3,100 కోట్లు రావాల్సిఉంద‌న్నారు. ఏపీకి ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నాలు అందించ‌డంపై కేంద్ర‌ప్ర‌భుత్వం సానుకూలంగా లేద‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌పై కేంద్రాన్ని సీరియ‌స్ గా అడుగుతామ‌ని తెలిపారు.