మాది ఒకే కులం…ఖాకీ కులం…!

AP Dgp Thakur Reaction On Ys Jagan Allegations Ps

ఏపీలో ఒకే సామాజికవర్గానికి చెందిన 35మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్‌ ఇచ్చారని సోమవారం ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ ఆరోపించి ఎన్న్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆయన డీజీపీ ఠాకూర్‌ పోలీసు యంత్రాంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే డీజీపీ, ఇంటెలిజిన్స్‌ ఏడీజీని బాధ్యతల నుంచి తప్పించాలని ఎన్నికల సంఘాన్ని జగన్‌ డిమాండ్ చేశారు. అయితే తాజాగా జగన్ వ్యాఖ్యల మీద ఏపీ డీజీపీ ఠాకూర్‌ స్పందించారు. మంగళవారం తిరుపతిలో ఆరు రాష్ట్రాల పోలీస్‌ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది.

ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా పార్లమెంట్‌ ఎన్నికల భద్రత విషయంపై చర్చలు జరిపినట్లుగా సమాచారం. మావోయిస్టుల కదలికలు, పోలీస్‌ సిబ్బంది తరలింపుపై చర్చలు జరిపినట్లు తెలియవచ్చింది. ఈ సందర్భంగా ఏపీ డీజీపీ మాట్లాడుతూ తన కులం ఇక్కడ ఎక్కడా లేదని, నిజాయితీగా పనిచేస్తున్నానని, డీజీగా ఉన్నప్పటి నుంచి అందరికీ తెలుసునని అన్నారు. పోలీసులకు ఒకే కులం ఉంటుందని, అదే ఖాకీ కులమని అన్నారు. డ్యూటీలో చేరిన రోజే కులాన్ని పక్కన పెడుతామని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు నిర్దేశం ప్రకారమే ప్రమోషన్ల విషయంలో చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ప్రమోషన్ల పై జ్యుడీషియల్‌ స్క్రూటినీ ఉంటుందని, ప్రమోషన్లు అన్నీ రూల్స్ ప్రకారం, సీనియారిటిని బట్టే ఇచ్చి తీరతామని చెప్పుకొచ్చారు.