కులాల గుట్టు విప్పుతున్న ఏపీ ఇంటలిజెన్స్.

Ap Intelligence Survey On Andhra pradesh caste category

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే అధికారప్రతిపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అటు వైసీపీ తరపున భారీ ఫీజ్ తీసుకుని మరీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారు. ఇప్పటికే ఏపీ లో రాజకీయ పరిస్థితిని అంచనా వేయడానికి ప్రశాంత్ కి సంబంధించిన సర్వే టీం లు అన్ని జిల్లాల్లో తిరుగుతున్నాయి. ఒక్కో జిల్లాలో దాదాపు 100 మందితో కూడిన బృందం ఈ సర్వే లో పాలుపంచుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సర్వే లో క్షేత్ర స్థాయి రాజకీయ వాతావరణం, వైసీపీ పరిస్థితి గురించి సమాచారం సేకరిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం దూకుడుతో అధికార పక్షం కూడా అలెర్ట్ అయ్యింది.

రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందు నిర్వహించిన స్మార్ట్ పల్స్ సర్వే లో సేకరించిన కుల గణన వివరాల్ని ఓటర్ లిస్ట్ కి సంధానం చేసేలా ఓ రహస్య సర్వే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సర్వే కోసం ఏపీ ఇంటలిజెన్స్ విభాగం పని చేస్తోందని తెలుస్తోంది. జన్మభూమి కమిటీ సభ్యులు సమాచారాన్ని సేకరిస్తుంటే ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఏ ఎస్సై లేదా హెడ్ కాని స్టేబుల్ వారి మీద పర్యవేక్షణ చేస్తూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ లో మొదలైన ఈ సర్వే ఆగష్టు లో పూర్తి అయ్యే అవకాశం ఉందట. ఈ సర్వే పూర్తి అయితే ఇండియా లో తొలిసారిగా ఎన్నికల వ్యూహాలకు సరిపోయేలా బూత్ ల వారీ కులాల డేటా బ్యాంకు అందుబాటులోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే జరిపించడానికి ఎన్నికల కోణం ఒకటైతే కాపు రిజర్వేషన్ అంశం ఇంకో ప్రధాన కారణం.