టీడీపీ ఎంపీల డిమాండ్స్ కి జైట్లీ రియాక్షన్…

Arun Jaitley reaction to TDP MPs protest

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఏపీ విభ‌జ‌న‌చ‌ట్టం హామీల అమ‌లుకు కేంద్రం క‌ట్టుబ‌డి ఉంద‌ని ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ రాజ్య‌స‌భ‌లో స్ప‌ష్టం చేశారు. ఆంధ్రప్ర‌దేశ్ కు ఇప్ప‌టికే ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించామ‌న్నారు. ప్ర‌త్యేక హోదాతో రావాల్సిన నిధుల‌ను ప్ర‌త్యేక ప్యాకేజీ రూపంలో ఎలా ఇవ్వాల‌న్న దానిపై చ‌ర్చిస్తున్నామ‌ని తెలిపారు. విదేశీ ఆర్థిక సాయంతో చేప‌ట్టే ప్రాజెక్ట్ నిధుల రూపంలో ఆ లోటు భ‌ర్తీచేస్తామ‌ని చెప్పారు. ఈ నిధుల‌కు సంబంధించి జ‌న‌వ‌రి 3న సీఎం చంద్ర‌బాబు త‌మ‌కు లేఖ‌రాశార‌ని, నాబార్డ్ ద్వారా ఆ నిధులు కేటాయించాల‌ని సీఎం ఆ లేఖ‌లో కోరార‌ని జైట్లీ చెప్పారు. అయితే ఈఏపీల‌కు నాబార్డ్ ద్వారా నిధులు ఇవ్వాలంటే స‌మ‌స్య ఎదుర‌వుతోంద‌ని, అలా ఇస్తే రాష్ట్ర రుణ‌సామ‌ర్థ్యం త‌గ్గుతుంద‌ని చెప్పారు. ఈఏపీ నిధులు ఎలా ఇవ్వాలనే విష‌య‌మై చ‌ర్చిస్తున్నామ‌ని, ప్ర‌త్యామ్నాయ వ‌ర్గాల్లో ఆ నిధులు మంజూరుచేసే అంశంపై చ‌ర్చిస్తున్నామ‌ని, దీనిపై మాట్లాడేందుకు ఏపీ ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శిని ఢిల్లీకి పిలిచామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే ఏపీ రెవెన్యూ లోటు భ‌ర్తీకి రూ. 3, 900 కోట్లు చెల్లించామ‌ని తెలిపారు. రైల్వే జోన్ విష‌యంలో అన్ని రాష్ట్రాల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నామ‌ని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్ చెప్పారు.జోన్ విష‌యంలో సానుకూల ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని వివ‌రించారు.

అయితే మంత్రుల వివ‌ర‌ణ‌పై టీడీపీ ఎంపీలు సంతృప్తి వ్య‌క్తంచేయ‌లేదు. హామీలవారీగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తేనే ప్ర‌జ‌లు న‌మ్ముతార‌ని, ఏవేవో టెక్నిక‌ల్ అంశాలు తెరమీద‌కు తెస్తే ఎవ‌రూ న‌మ్మే స్థితిలో లేర‌ని తెగేసి చెప్పారు. విభ‌జ‌న హామీలు అమలు చేయాల‌ని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎంపీలు ఉద‌యం నుంచి పార్ల‌మెంట్ ను స్తంభింప‌జేశారు. నినాదాలు చేస్తూ, ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శిస్తూ, వెల్ లోకి దూసుకెళ్లి స‌భ‌ను హోరెత్తించారు. విభ‌జ‌న హామీల‌పై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయాల‌ని, ఇచ్చిన హామీల‌ను ఎప్ప‌టిలోగా అమ‌లు చేస్తారో కూడా స్ప‌ష్టంగా చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అయితే టీడీపీ ఎంపీల అభ్య‌ర్థ‌న‌ను కేంద్ర మంత్రులు తోసిపుచ్చారు. ఏపీకి సంబంధించి స‌భ‌లో ప్ర‌క‌ట‌న చేస్తే… మిగిలిన పార్టీలు కూడా ఇలాగే ఆందోళ‌న‌కు దిగుతాయ‌న్న మంత్రులు… హామీలు అమ‌లుచేస్తామ‌ని టీడీపీ ఎంపీల‌కు స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేశారు. మంత్రుల వివ‌ర‌ణతో సంతృప్తి చెంద‌ని ఎంపీలు మ‌రోమారు స‌భా కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకున్నారు.