ఆర్‌ఆర్‌బీ రిక్రూట్‌మెంట్‌ ఆందోళనలు

ఆర్‌ఆర్‌బీ రిక్రూట్‌మెంట్‌ ఆందోళనలు

రైల్వే రిక్రూట్మెంట్‌ బోర్డు పరీక్షల్లో అక్రమాలు జరిగాయని నిరసిస్తూ బీహార్‌ లో ఆందోళనలు మూడవ రోజు కూడా కొనసాగాయి. బుధవారం గయ నగరంలో ఉద్యోగార్థులు రైలుకు నిప్పు పెట్టారు. దాదాపు 200 మంది అభ్యర్థులు రైల్వే స్టేషన్‌ కు చేరుకొని ఆగి ఉన్న ఓ రైలును తగలబెట్టారు. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు, గయా జిల్లా పోలీస్‌ యంత్రాంగం, నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కొంతమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని గయ ఎస్‌ఎస్‌పీ ఆదిత్యకుమార్‌ చెప్పారు. నిరసనకారులు నిప్పటించిన కోచ్‌ యార్డ్‌ లో ఖాళీగా నిలిపి ఉందని, అందుకే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తూర్పు మధ్య రైల్వే సీపీఆర్వో రాజేష్‌ కుమార్‌ తెలిపారు.

బీహార్‌ లోని గయా, పాట్నా, నలంద, నవాదా, ఆరా, హాజిపూర్‌ ప్రాంతాల్లో వేలాది మంది నిరసనకారులు రైలు పట్టాలపై రైలు రోకో చేశారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని తెలిపారు. నిరసనల కారణంగా అధికారులు కొన్ని రైళ్లు రద్దు చేశారు. మరికొన్నింటిని ప్రత్యామ్నాయ మార్గాల్లో నడిపారు. ఆర్‌ఆర్‌బిఎన్‌టిపిసి మొదటి దశ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష లో ఉత్తీర్ణత సాధించిన వారికి మళ్లీ పరీక్షను నిర్వహించాలన్న రైల్వే నిర్ణయాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. లెవల్‌ 2 నుండి లెవల్‌ 6 వరకు 35,000 పోస్ట్‌లకు పైగా ప్రకటనలు చేసిన పరీక్షలకు దాదాపు 1.25 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.