వరంగల్‌ లో ప్రేమోన్మాది దారుణం

వరంగల్‌ లో ప్రేమోన్మాది దారుణం

తమను ప్రేమించడం లేదనే కోపంతో తరచూ యువకులు అఘాయిత్యాలు, అకృత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇలాంటి ఘటనే జిల్లా కేంద్రంలోని అబ్బనికుంటలో బుధవారం చోటు చేసుకుంది. వరంగల్‌ 11వ డివిజన్‌క్రిస్టియన్‌ కాలనీకి చెందిన బసికె నిఖిల్‌ 10వ డివిజన్‌ అబ్బనికుంటకి చెందిన మైనర్‌ బాలికను వేధిస్తున్నాడు. కొంతకాలంగా తనను ప్రేమించాలని ఆమె వెంట పడుతుండగా బాలిక పట్టించుకోలేదు. అంతేకాకుండా అతనికి దూరంగా ఉండసాగింది.

దీంతో కోపం పెంచుకున్న నిఖిల్‌ బుధవారం సాయంత్రం ఆమె ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని వెళ్లిన ఆయన బీరు సీసా పగలగొట్టి దానితో బాలికపై దాడి చేశాడు. బాలిక తప్పించుకోవడంతో చేతిపై తీవ్రగాయాలయ్యాయి. ఆమె గట్టిగా అరవడంతో గమనించిన స్థానికులు వెంటనే బాలికను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు ప్రాణాపాయం ఏమీ లేదని తేల్చారు. ఆ తర్వాత బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో యువకుడిపై కేసు నమో దు చేసి దర్యాప్తు ప్రారంభించామని మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్‌ నరేష్‌కుమార్‌ తెలిపారు.