ఇండిగో ఎయిర్ లైన్స్ పై కేంద్ర‌మంత్రి ఆగ్ర‌హం

aviation-minister-ashok-gajapathi-raju-fires-on-indigo-airlines

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఇండిగో ఎయిర్ లైన్స్ పై విమాన‌యాన శాఖ మంత్రి అశోక గ‌జ‌ప‌తి రాజు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. రెండు రోజుల క్రితం బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి పి.వి.సింధుతో అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన ఇండిగో సిబ్బంది తాజాగా ఓ ప్ర‌యాణికుడిపై విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడిచేశారు. త‌మ‌ను ప్ర‌శ్నించినందుకు గానూ ఇండిగో సిబ్బంది ఆ ప్ర‌యాణికుణ్ని కింద‌ప‌డేసి చావ‌బాదారు. గత నెల 15న జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగుచూసింది. ఈ ఘ‌ట‌న‌పైనే అశోక్ గ‌జ‌ప‌తి రాజు ఇండిగో తీరును ప్ర‌శ్నించారు. వివ‌రాల్లోకి వెళ్తే…చెన్నైకి చెందిన రాజీవ్ క‌తియాల్ అనే ప్ర‌యాణికుడు ఢిల్లీ విమానాశ్ర‌యం వ‌ద్ద కోచ్ బ‌స్సు కోసం ఎదురుచూస్తూ నిల్చున్నాడు. ఆయ‌న‌తో పాటు మ‌రికొంత‌మంది ప్ర‌యాణికులు కూడా అక్క‌డే నిల్చుని ఉన్నారు. అయితే బ‌స్సు అనుకున్న స‌మ‌యానిక‌న్నా ఆల‌స్యంగా వ‌చ్చింది. దీనిపై రాజీవ్ అక్క‌డున్న ఇండిగో సిబ్బందిని దుర్భాష‌లాడాడు. దీంతో సిబ్బంది ఇత‌ర ప్ర‌యాణికుల‌తో క‌లిసి బ‌స్సు ఎక్కుతున్న రాజీవ్ ను బ‌లంగా ప‌ట్టుకుని వెన‌క్కి తీసుకొచ్చారు. ఆగ్రహంతో రాజీవ్ వారిని ప్ర‌తిఘ‌టించే ప్ర‌య‌త్నం చేశాడు.

civil-aviation-minister-sum

వెంట‌నే ఇద్దరు సిబ్బంది రాజీవ్ ను కింద‌ప‌డేసి ఇష్టానుసారం కొట్టారు. లేవ‌నీకుండా చిత‌క‌బాదారు. ఈ దృశ్యాన్ని అక్క‌డే ఉన్న ప్ర‌యాణికుడు ఒక‌రు ఫోన్ లో రికార్డు చేసి సోష‌ల్ మీడియాలో పోస్టుచేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్లో వైర‌ల్ గా మారింది. ఇండిగో సిబ్బంది రాజీవ్ తో ఎంత దురుసుగా ప్ర‌వ‌ర్తించారంటే.. వారిద్ద‌రూ కోపంతోనో, ఆవేశంతోనో కాక… కావాల‌ని ఆ వ్య‌క్తిని చిత‌క‌బాదిన‌ట్టు వీడియో చూస్తుంటే అర్ధ‌మ‌వుతోంది. ఇండిగో సిబ్బంది వైఖ‌రిపై దేశ‌వ్యాప్తంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. విష‌యం బ‌య‌టికి రావ‌డంతో ఇండిగో ఎయిర్ లైన్స్ అధ్య‌క్షుడు ఆదిత్య ఘోష్… రాజీవ్ ను ఫోన్ లో ప‌రామ‌ర్శించి క్ష‌మాప‌ణ చెప్పారు. రాజీవ్ పై దాడిచేసిన ఇద్ద‌రు సిబ్బందిని విధుల‌నుంచి తొల‌గించారు. అటు దీనిపై వెంట‌నే నివేదిక ఇవ్వాలని, దాడికి పాల్ప‌డిన వారిపై తీసుకున్న చ‌ర్య‌లేమిటో తెలియ‌జేయాల‌ని అశోక‌గ‌జ‌ప‌తి రాజు ఆదేశించారు. ప్ర‌యాణికులు ఏవైనా అనుచిత ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డిన‌ప్పుడు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టుగానే.. ఎయిర్ లైన్స్ సిబ్బందిపై క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి హెచ్చ‌రించారు. రోజూ ఏదో ఒక వివాదం లేవ‌నెత్త‌డంపై ఆయ‌న ఇండిగో తీరును త‌ప్పుబ‌ట్టారు.