వైజాగ్‌లో ఎన్‌బికే స్టూడియో

balakrishna plannings on NBK Studio in Vizag

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్దికి తనవంతు కృషి చేస్తున్నాడు. తెలుగు సినిమా పరిశ్రమను ఏపీకి తరలించేందుకు చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు విశ్వ ప్రయత్నాలు చేశారు. కాని ఆ అవసరం, ఆ అవకాశం లేదని తెలుగు సినిమా పెద్దలు తేల్చి చెప్పడంతో ఆ ఆలోచనను చంద్రబాబు నాయుడు విరమించుకున్నాడు. అయితే ఏపీ ప్రభుత్వం వైజాగ్‌ మరియు అమరావతిలో స్టూడియోలను నిర్మించేందుకు భారీ ఎత్తున నిర్మాతలను ఆహ్వానిస్తుంది. నిర్మాతలు మరియు దర్శకులు ఏపీలో ఫిల్మ్‌ స్టూడియోలు నిర్మించడం వల్ల మెల్ల మెల్లగా ఏపీకి సినీ పరిశ్రమ వస్తుందనే అభిప్రాయంతో ఏపీ ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అదునుగా పలువురు దర్శక నిర్మాతలు తాము స్టూడియోలు నిర్మించేందుకు సిద్దం అంటూ ముందుకు వస్తున్నారు.

వైజాగ్‌లో ఒక భారీ ఫిల్మ్‌ స్టూడియోను నిర్మించేందుకు బాలకృష్ణ దరఖాస్తు చేసుకున్నాడు. ఉన్న ప్రభుత్వం తమ వారిదే అవ్వడంతో వెంటనే ప్రభుత్వం అనుమతులకు రంగం సిద్దం చేసింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఇచ్చే ల్యాండ్‌లో స్టూడియోను మరియు కన్వెన్షన్‌ సెంటర్‌ను బాలకృష్ణ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. భారీ ఎత్తున ఎన్‌బీకే స్టూడియో ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎన్టీఆర్‌ అప్పట్లో హైదరాబాద్‌లో రామకృష్ణ సినీ స్టూడియో నిర్మించారు. ఇప్పుడు బాలకృష్ణ వైజాగ్‌లో స్టూడియో నిర్మాణంకు సిద్దం అవుతున్నారు. వైజాగ్‌లో ఇప్పటికే రామానాయుడు స్టూడియో ఉన్న విషయం తెల్సిందే. ఇక మోహన్‌బాబుతో పాటు మరో ముగ్గురు నలుగురు నిర్మాతలు కూడా వైజాగ్‌లో స్టూడియో ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందరిలో మొదటగా బాలయ్య స్టూడియో ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.