వజ్రపు ఉంగరాన్ని దొంగిలించిన బ్యూటీషీయన్‌

వజ్రపు ఉంగరాన్ని దొంగిలించిన బ్యూటీషీయన్‌

మేకప్‌ చేసేందుకు ఇంటికి వచ్చిన ఓ బ్యూటీషీయన్‌ ఏకంగా రూ.5లక్షల విలువైన వజ్రపు ఉంగరాన్ని దొంగిలించిన ఘటన బంజారాహిల్స్‍ పోలీస్‌స్టేష‌న్‌ పరిధిలో వెలుగుచూసింది. బంజారాహిల్స్‍ రోడ్‌ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసముంటున్న వైశాలీ రెడ్డి అనే మహిళ బుధవారం అర్బన్‌ క్లాప్‌ ఆన్‌లైన్‌ సర్వీస్ ప్రొవైడర్‌ ద్వారా బ్యూటీషియన్‌ సేవలు కావాలని స్లాట్‌ బుక్‌ చేసుకుంది. ఉదయం 11 గంటల సమయంలో రయీసా భాను అనే బ్యూటీషియన్ ఆమె ఇంటికి వచ్చింది.

అరగంటలో మేకప్‌ పని ముగియడంతో వైశాలీ మంచినీళ్లు తాగేందుకు లోనికి వెళ్లి తిరిగొచ్చేసరికి రయీసా భాను కనిపించలేదు. హాల్‌లో పర్సుపై పెట్టిన డైమండ్ రింగ్ కూడా కనిపించకపోవడంతో ఆమె షాకైంది. దీంతో సీసీటీవీ పుటేజీ పరిశీలించగా డైమండ్ రింగ్‌ తీసుకుని రయీసా బయటకు వెళ్తున్నట్లు స్పష్టంగా రికార్డయింది. దీంతో బాధితురాలు గురువారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.