భాగమతి… తెలుగు బులెట్ రివ్యూ

Bhaagamathie-review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   అనుష్క, ఉన్ని ముకుందన్ , ధనరాజ్ , ప్రభాస్ శ్రీను 
నిర్మాతలు :    వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్, జ్ఞానవేల్ రాజా 
దర్శకత్వం :   అశోక్ 
సినిమాటోగ్రఫీ:  మది. ఆర్, సుశీల్ చౌదరి  
ఎడిటర్ :   కోటగిరి వెంకటేశ్వరరావు 
మ్యూజిక్ :   తమన్ ఎస్.ఎస్ 

బాహుబలి లాంటి సినిమా తర్వాత అనుష్క ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో అన్న ఉత్కంఠ సామాన్య ప్రేక్షకులకే కాదు ఫిలిం ఇండస్ట్రీ వర్గాల్లోనూ వుంది. వచ్చే సినిమా భాగమతి అని క్లారిటీ వచ్చినప్పటికీ అది ఏ తరహా సినిమా అన్న ఉత్కంఠ కొనసాగింది. ఇది ఓ దశలో చారిత్రక చిత్రమని , ఇంకో దశలో అరుంధతిలా హారర్ సినిమా ని ప్రచారం జరిగింది. ట్రైలర్ బయటకు వచ్చాక ఇది నిజంగా హారర్ సినిమా అని ఫిక్స్ అయ్యారు. మొత్తానికి ఇన్ని అంచనాలు, ఊహాగానాల మధ్య వచ్చిన భాగమతి ఎలాంటి సినిమా , ఎలా వుందో చూద్దామా ..

కథ…

చంచల ఓ ఐఏఎస్ అధికారి. నిజాయితీ పరుడైన కేంద్రమంత్రి ఈశ్వర ప్రసాద్ దగ్గర సెక్రటరీ హోదాలో పనిచేస్తుంది. అయితే అనూహ్యంగా చంచల ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమె చంపింది తాను పెళ్లి చేసుకోబోయే ప్రేమికుడిని. ఈ కేసులో జైల్లో ఉన్న చంచల ని సిబిఐ రహస్యంగా విచారించాలి అనుకుంటుంది. కేంద్రమంత్రి ఈశ్వర ప్రసాద్ అవినీతిపరుడని నిరూపించడానికీ అతని మీద పురాతన ఆలయాల్లోని విగ్రహాల కేసు వేయాలన్న ప్రయత్నం జరుగుతుంటుంది. ఈ కేసులో చంచలని రహస్యంగా విచారించాలని ఓ పాడుబడిన భవంతికి ఆమెని తీసుకెళతారు. అక్కడ ఆమెని భాగమతి అనే ఆ కోటని ఏలిన దెయ్యం హింసిస్తుంటుంది. భాగమతికి, చంచల కి ఉన్న సంబంధం ఏంటి ? విగ్రహాల చోరీ కేసులో ఈశ్వర ప్రసాద్ కి ఏమి సంబంధం అనేది మిగిలిన కథ.

విశ్లేషణ …

” భాగమతి “ లో ఏమి చెప్పాలి అని దర్శకుడు అశోక్ అనుకున్నాడో దానికి తగినట్టుగా సినిమాని ప్రొజెక్ట్ చేసి ఉంటే ఎలా ఉండేదో గానీ అందుకు భిన్నంగా సస్పెన్స్ ఎలిమెంట్ మైంటైన్ చేయడం ప్రధాన సమస్య. ఆ సస్పెన్స్ కి తగ్గట్టు ఫస్ట్ హాఫ్ అంతా బిగి ఉత్కంఠ మధ్య నడుస్తుంది. వినోదం లేకపోయినా హారర్ ఎలిమెంట్ తో ప్రేక్షకుడు కధలో పూర్తిగా లీనం అయిపోతాడు. ఈ కథ ఎటు వెళుతుందో అన్న ఉత్కంఠ మధ్య సెకండ్ హాఫ్ చూస్తుంటాడు. కానీ కథ ముందుకు నడవదు. చంచలని బాగమతి అనే దెయ్యం హింసిస్తుందన్న ప్లాట్ గురించి సీక్రెట్ తెలియగానే సినిమా మీద మొత్తం ఇంటరెస్ట్ సడలిపోతుంది. పైగా ఆ తర్వాత కధలో తీసుకున్న మలుపు కొత్తగా ఎమన్నా ఉందా అంటే అదీ లేదు.

హారర్ నేపథ్యంలో వచ్చిన పిజ్జా, కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన దొంగాట, రాజు గారి గది లాంటి సినిమాలు ఒక్కసారిగా ప్రేక్షకుడి మదిలో మెదులుతాయి. విలన్ ని ట్రాప్ చేసేందుకు హారర్ ట్రాప్ అన్నది ఐదేళ్ల నాడు కొత్త ఏమో గానీ ఇప్పుడు కానే కాదు. అనుష్క, మలయాళ నటులు జయరామన్ , ఉన్ని ముకుందన్ ఈ సినిమాకు ప్లస్. అనుష్క ఇటు ఐఏఎస్ అధికారిగా, అటు భాగమతి భారిన పడిన యువతిగా చాలా బాగా చేసింది. జయరామన్, ఉన్ని ముకుందన్ కూడా చాలా బాగా చేశారు. ప్రభాస్ శ్రీను, ధనరాజ్ పాత్రలు అక్కడక్కడా నవ్వులు పంచాయి. అయితే అదంతా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చేసినదే కావడంతో అంత ఇంపాక్ట్ కనిపించదు. ఇక ఆశా శరత్ పాత్ర కూడా భాగమతి చూసినవాళ్లకు గుర్తుండి పోతుంది.

సాంకేతిక విభాగం పనితీరు చూస్తే దర్శకుడు అశోక్ తాను వేసిన ట్రాప్ లో తానే పడ్డాడు. ఎంత బిగువుగా కథ నడిపించాడో అదంతా ఓ ట్రాప్ అని తేలిపోగానే అప్పటిదాకా ఫీల్ అయిన ఫీలింగ్ అంతా పోయింది. ఏదైతే ఈ సినిమాకు ప్లస్ అని దర్శకుడు భావించాడో అదే మైనస్ అయ్యింది. ఇలాంటి కధలు చేసుకుంటున్నప్పుడు స్క్రీన్ ప్లే కాస్త అటు ఇటు అయితే మొత్తంగా ఫలితం తేడా వస్తుంది. ఇప్పుడు జరిగింది అదే. ఇక కెమెరా మెన్ మది, సంగీతం చేసిన థమన్ తమదైన బ్రాండ్ చూపించారు. భాగమతి కోట సెట్ వేసిన రవీందర్ ఆర్ట్ వర్క్ సూపర్. కానీ వీళ్ళ ప్రతిభ వృధా అయ్యింది.

తెలుగు బులెట్ పంచ్ లైన్… ”భాగమతి” అరుంధతిని చూసి నడుస్తూ కాలు జారి పడింది పాపం.

తెలుగు బులెట్ రేటింగ్… 2.5 /5 .