డిసెంబర్ 8న భారత్ బంద్‌

డిసెంబర్ 8న భారత్ బంద్‌

రైతులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. డిసెంబర్ 8న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. దేశ రాజధాని ఢిల్లీకి దారితీసే రహదారులన్నింటినీ దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు కొలిక్కి రాకపోవడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన కారణంగా ఎమర్జెన్సీ సేవలకు ఆటంకం కలుగుతోందని, కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన వేళ.. రైతులు తమ ఆందోళనను తీవ్రతరం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

డిసెంబర్ 8న భారత్ బంద్ పాటించాలని పిలుపు ఇస్తున్నట్లు అఖిల భారత కిసాన్ యూనియన్ లోఖోలవాల్ జనరల్ సెక్రటరీ హర్వీందర్ సింగ్ తెలిపారు. దీంతో పాటు ఆదివారం (డిసెంబర్ 5) దేశవ్యాప్తంగా ప్రధాని దిష్టిబొమ్మలను దహనం చేస్తామని చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన శుక్రవారంతో 9వ రోజుకు చేరుకుంది. రైతుల ఆందోళనకు వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.

ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కారణంగా వేలాది మంది ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని న్యాయవాది ఓం ప్రకాశ్‌ పరిహార్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఒకవేళ కరోనా వైరస్‌.. కమ్యూనిటీ వ్యాప్తి దశలోకి చేరుకుంటే దేశంలో భారీ వినాశనం సృష్టించే ప్రమాదం ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా సరిహద్దుల్లో రైతులు బైఠాయించడంతో ఆ మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయని, దీని వల్ల అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలుగుతోందని పిటిషనర్‌ ఆరోపించారు. రైతులను తక్షణమే అక్కడి నుంచి ఖాళీ చేయించి సరిహద్దులను తెరిపించాలని కోరారు. దీంతో పాటు నిరసనకారులు మాస్క్‌లు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.