వై.ఎస్ మరణం, ఆ దేశాధ్యక్షుల హత్యకి సంబంధం?

http://telugubullet.com/wp-content/uploads/2017/06/bhumana-karunakar-reddy-sen.jpg

వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయి దాదాపు ఏడేళ్లు గడిచాక అది హత్యేనంటూ మరోసారి వాదన బయటికి వచ్చింది. అప్పట్లో ఇదే అంశాన్ని ఓ వూరు పేరు లేని విదేశీ వెబ్ సైట్ ప్రచురిస్తే దాని ఆధారంగా ఓ టీవీ వార్త ఇస్తే రాష్ట్రం అట్టుడికిపోయింది. ఆ వార్త తర్వాత వై.ఎస్ అభిమానులు రాష్ట్రంలో తీవ్ర ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. రిలయన్స్ స్టోర్స్ మీద కొందరు దాడులకు పాల్పడి ఇప్పటికీ ఆ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ విషయం క్రమంగా మరుగున పడిపోయింది. కానీ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మళ్లీ ఇదే అంశాన్ని లేవనెత్తారు.

వై.ఎస్ మరణం గురించి భూమన అన్నమాటలు ఇవే. ‘వై.ఎస్ ది ముమ్మాటికీ హత్యే. దాని వెనుక అంతర్జాతీయ గ్యాస్ మాఫియా హస్తం వుంది. ఈ రాష్ట్రంలో బయటపడ్డ గ్యాస్ నిల్వలు రాష్ట్రానికి ఉపయోగపడాలని వై.ఎస్ పట్టుబట్టడం వల్ల అది ఇష్టం లేని వాళ్ళు వై.ఎస్ ని చంపించారు. ఇంతకుముందు పనామా, గ్వాటిమాల దేశాల అధ్యక్షులు ఇలాగే పట్టుబట్టి ఆపై హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారు. విచారణలో అవి రెండు హత్యలని తేలింది. కానీ వై.ఎస్ విషయంలో విచారణ లేకుండా పోయింది. అందుకే ఇప్పటికీ వై.ఎస్ మరణం మిస్టరీ గా వుంది’. ఈ విధంగా రాజమండ్రి పార్టీ ప్లీనరీ సభలో భూమన మాట్లాడిన మాటలు సంచలనం అయ్యాయి.

ఇన్నాళ్లు వై.ఎస్ మరణం గురించి మౌనంగా వున్న భూమన ఇలా మాట్లాడడం వెనుక వేరే కారణాలు ఉన్నాయని కొందరి అనుమానం. మరో రెండేళ్లలో ఎన్నికలు రాబోవడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా నినాదంతో కాంగ్రెస్ మళ్లీ ఏపీ లో అడుగు పెట్టడం చూసి వారి మీద సందేహం కలిగేలా భూమన ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని వారి అభిప్రాయం. పైగా కాంగ్రెస్ కి హోదా విషయంలో పవన్ మద్దతు దొరకడం కూడా వైసీపీ తట్టుకోలేకపోతోంది. అందుకే జనం దృష్టిని మరల్చేందుకు భూమన ఈ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఏ ఆధారాలు లేకుండా ఓ సున్నిత అంశంలో భావోద్వేగాలు రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసమో భూమన ఆలోచించుకోవాలి.