చిన్న సినిమాకు పెద్ద స‌పోర్ట్

జార్జిరెడ్డి సినిమా రివ్యూ

హీరోది ఒక సినిమా అనుభ‌వం. ద‌ర్శ‌కుడూ అంతే. వాళ్లేమీ సూప‌ర్ స‌క్సెస్‌లు ఇవ్వ‌లేదు. నిర్మాత‌లు కొత్త వాళ్లే. ఎవ‌రికీ పెద్ద‌గా బ్యాగ్రౌండ్ ఏమీ లేదు. వీళ్లంతా క‌లిసి చేసిన సినిమాను ఇండ‌స్ట్రీ ఓన్ చేసుకుని దానికి అండ‌గా నిల‌వ‌డం అంటే ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌య‌మే. ఈ అవ‌కాశం జార్జి రెడ్డి చిత్రానికి ద‌క్కింది. నెల కింద‌ట ఒక సెన్సేష‌న‌ల్ ట్రైల‌ర్‌తో ఈ సినిమా వార్త‌ల్లోకి వ‌చ్చింది. అప్ప‌టికే దీని పోస్ట‌ర్లు ఆస‌క్తి రేకెత్తించాయి.

నాలుగు ద‌శాబ్దాల కింద‌ట చ‌నిపోయిన ఉస్మానియా యూనివ‌ర్శిటీ విద్యార్థి నాయ‌కుడు జార్జి రెడ్డి క‌థ‌తో తెర‌కెక్కిన సినిమా కావ‌డంతో మొద‌ట్లోనే దీనిపై కొంత ఆస‌క్తి నెల‌కొంది. ఐతే ట్రైల‌ర్ చూశాక జ‌నాల‌కు సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. అర్జున్ రెడ్డి త‌ర‌హాలో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌గ‌ల స‌త్తా దీనికుంద‌ని అర్థ‌మైంది.

త‌మ స‌న్నిహితుల సినిమాలైతే త‌ప్ప ఇండ‌స్ట్రీ జ‌నాలు వేరే సినిమా గురించి బైట్స్ ఇవ్వ‌డం ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్‌లో భాగం కావ‌డం జ‌ర‌గ‌దు. కానీ జార్జి రెడ్డి గురించి ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు త‌మ‌కు తాముగా స్పందించి దాని ప్ర‌మోష‌న్స్‌లో భాగం అవుతుండ‌టం విశేష‌మే. మెగాస్టార్ చిరంజీవి అంత‌టి వాడు తాజాగా ఈ సినిమాలోని ఓ పాట‌ను లాంచ్ చేసి జార్జి రెడ్డి గురించి, ఈ సినిమా గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడాడు.

మ‌రోవైపు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా జార్జి రెడ్డి మీద తీసిన సినిమాపై ఆస‌క్తితో ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు కూడా రావ‌డానికి రెడీ అయ్యాడు. అనివార్య కార‌ణాల‌తో ఆ ఈవెంట్ క్యాన్సిలైంది. వీరి సోద‌రుడు నాగ‌బాబు సినిమా గురించి చాలా గొప్ప‌గా మాట్లాడాడు. ఇంకా సుకుమార్, సందీప్ రెడ్డి వంగ‌, నిఖిల్ సిద్దార్థ‌, రామ్ ఇలా చాలామంది స్వ‌చ్ఛందంగా సినిమా గురించి స్పందించ‌డం, పాజిటివ్ కామెంట్స్ చేయ‌డం విశేషం. ఇలాంటి చిన్న సినిమాకు ఇంత స‌పోర్ట్ దొర‌క‌డం ఆశ్చ‌ర్య‌మే.