ఏపీ బీజేపీకి భారీ షాక్…!

BJP MLA Akula Likely To Quit The Party

ఏపీ బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే సీనియర్ నేత ఈ రోజు పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం రాజమండ్రి అర్బన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈరోజు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఢిల్లీ కూడా చేరుకున్నట్లు సమాచారం. బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే పవన్‌తో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది.

పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఆయన బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు సమాచారం. ఆకుల భార్య లక్ష్మీ పద్మావతి పవన్‌ కు వీరాభిమాని. అప్పట్లో ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలంటూ శ్రీకాకుళంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చేసిన దీక్షకు మద్దతుగా రాజమండ్రి సబ్‌కలెక్టర్‌ ఆఫీసు వద్ద దీక్ష చేశారు. ఈ సందర్భంగా భర్త ఒక పార్టీలో, భార్య ఒక పార్టీలో ఉన్న విషయాన్ని ప్రస్తావించగా అటువంటిదేమి లేదని, తాను పవన్‌ కల్యాణ్‌ అభిమానినని, ఉద్దానం బాధితులకు మద్దతుగా కులమతాలు, రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న దీక్షలో పాల్గొన్నానని ఆమె తెలిపారు. ఇటీవల జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. దీంతో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరడం లాంఛనమేనని ప్రచారం జరుగుతోంది.