బీజేపీ,టీడీపీ మాటలయుద్దం కొనసాగుతోంది. టీడీపీపై విమర్శలు చేయడానికి ఎప్పుడూ ముందుండే బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు మరోసారి రాష్ట్రప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రత్యేకహోదాపై కొందరు కావాలనే గందరగోళానికి గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. విభజనహామీలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తోందని సోమువీర్రాజు చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఇచ్చిన నిధులను ఎలా వినియోగించారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 2017 బడ్జెట్ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు కేంద్రాన్ని మెచ్చుకున్నారని, ఏ రాష్ట్రానికీ ఇవ్వనంతగా నిధులు ఇచ్చారని కొనియాడారని గుర్తుచేశారు. అప్పుడు అలా మాట్లాడిన టీడీపీ నేతలు ఇప్పుడు అసలు నిధులే ఇవ్వలేదన్నట్టుగా విమర్శించడం తగదన్నారు. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చేందుకు 2022 వరకు సమయముందన్న సంగతి మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు.
ఏపీలో రాజ్ భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు కట్టాలని పునర్విభవజన బిల్లులో ఉందని, ఇప్పటికే కేంద్ర సర్కార్ వాటికోసం సాయం చేసిందని, మొత్తం రూ. 1500 కోట్లు ఇచ్చిందని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి రూ. 2,500 కోట్లు కేంద్రం ఇచ్చిందని..వీటన్నింటిని ఎలా ఖర్చు చేసిందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద వెనుకబడిన ప్రాంతాల ప్రణాళిక ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటివరకు అదనంగా ఎనిమిది యూనివర్శిటీలు వచ్చాయని, విద్యాసంస్థల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని చెప్పారు. విభజన చట్టంలో లేని చాలా హామీలను కూడా కేంద్రం అమలు చేసిందని తెలిపారు. అలాగే దక్షిణ భారతదేశం పట్ల వివక్ష అని మాట్లాడడం తగదని, బీహార్ , ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు మనకంటే వెనుకబడి ఉన్నాయని సోమువీర్రాజు అన్నారు.