Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్ ఎన్నికల్లో విజయంతో బీజేపీ కొత్త రికార్డు నెలకొల్పింది. పశ్చిమ బెంగాల్ తర్వాత ఒక రాష్ట్రంలో ఎక్కువసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీగా చరిత్ర సృష్టించింది. గుజరాత్ లో వరుసగా ఆరోసారి విజయం సాధించిన కమలం పార్టీ… వామపక్ష కూటమి రికార్డుకు అడుగుదూరంలో నిలిచింది. ఈ ఆరుసార్లలో నాలుగు సార్లు బీజేపీ గెలిచింది నరేంద్రమోడీ ఆధ్వర్యంలోనే కావడం విశేషం. 1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్ లో తొలిసారి విజయం సాధించింది బీజేపీ. 121 స్థానాల్లో గెలుపొంది స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ ఆ తర్వాత ఇక వెనుతిరిగిచూసుకోలేదు. 1998లో గుజరాత్ అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు జరిగాయి. 117 స్థానాలు దక్కించుకుని కమలం పార్టీ రెండో సారి అధికారం చేపట్టింది. కేశూభాయ్ పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కచ్ భూకంపం కేశూభాయ్ పటేల్ పదవికి ఎసరు తెచ్చి…నరేంద్రమోడీని తెరపైకి తెచ్చింది.
భూకంపం అనంతరం సహాయక చర్యలు చేపట్టడంలో అలసత్వం ప్రదర్శించారన్న ఆరోపణలు రావడంతో పటేల్ స్థానంలో నరేంద్రమోడీ గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ పరిణామం గుజరాత్ తో పాటు దేశ రాజకీయ ముఖచిత్రాన్నీ మార్చివేసింది. మోడీ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాదైనా గడవకముందే సబర్మతీ ఎక్స్ ప్రెస్ దహనం, గోద్రా అల్లర్లతో పారిశ్రామిక రాష్ట్రం గుజరాత్ మతరాజకీయాలకు కేంద్రబిందువుగా మారింది. గోద్రా అల్లర్లు దేశవ్యాప్తంగా తీవ్ర అలజడి రేపాయి. స్వతంత్ర భారత చరిత్రలో అదొక చీకటి అధ్యాయంగా చెప్పుకుంటారు. ఈ అల్లర్ల నేపథ్యంలో విమర్శలు చుట్టుముట్టడంతో మోడీ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో గుజరాత్ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగాయి. 2002 డిసెంబరులో జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘనవిజయంతో మోడీ రాజకీయ ప్రాభవం, గుజరాత్ అభివృద్ధి మొదలయ్యాయని చెప్పవచ్చు. గోద్రా అల్లర్ల రూపంలో తనపై పడ్డ మచ్చ తొలగించుకోడానికి మోడీ అభివృద్ధిపై దృష్టిపెట్టారు. గుజరాత్ ను కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి బాట పట్టించారు. గోద్రా అల్లర్ల ఆరోపణలు కొనసాగుతున్నప్పటికీ… 2007 ఎన్నికల్లో ఈ అభివృద్ధి మంత్రమే బీజేపీకి మరోసారి అధికారం కట్టబెట్టింది. మరో ఐదేళ్లు తిరిగేసరికి గుజరాత్ అంటే మోడీ, మోడీ అంటే గుజరాత్ అన్నంతగా ఆయన గుర్తింపు పొందారు. జాతీయ స్థాయి నేతగా ఎదిగారు.
2012 ఎన్నికల నాటికి బీజేపీలో అత్యంత ఆకర్షణీయ నేతగా మోడీ అవతరించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి ఆయనే అన్న ప్రచారమూ మొదలయింది. ఆ ఎన్నికల్లో గెలుపుతో ఇక బీజేపీలో మోడీకి తిరుగులేకుండా పోయింది. రెండేళ్లు తిరిగేసరికల్లా దేశంలో అత్యంత ఆకర్షణీయ నేతగా ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. గుజరాత్ లో జరిగిన గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు కారణం మోడీనే. అయితే ఈ సారి ఆయన రాష్ట్రానికి దూరంకావటం, 22 ఏళ్ల నుంచి వరుసగా పార్టీ అధికారంలో ఉండడం వల్ల వచ్చిన వ్యతిరేకత, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, రాహుల్ ప్రజాదరణ నేపథ్యంలో గుజరాత్ లో బీజేపీ గెలుపుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రధాని స్థానంలో ఉన్నప్పటికీ మోడీ గుజరాత్ ఎన్నికలను తేలిగ్గా తీసుకోలేదు. గత ఎన్నికల్లానే సర్వశక్తులూ ఒడ్డారు. బిజీ షెడ్యూల్ మధ్య రాష్ట్రమంతా విస్తృతంగా కలియతిరిగి… బీజేపీ ఓటుబ్యాంక్ చేజారకుండా జాగ్రత్తపడ్డారు. వరుసగా నాలుగోసారి గుజరాత్ గెలుపులో అంతా తానై వ్యవహరించారు.
మోడీ ప్రభావంతో ఆరుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ…మరోసారి కూడా ఇలాగే గెలుపొందితే పశ్చిమబెంగాల్ లోని వామపక్ష కూటమి నెలకొల్పిన రికార్డును సమంచేసినట్టు అవుతుంది. ఇప్పటిదాకా దేశచరిత్రలో ఓ రాష్ట్రంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీ వామపక్ష కూటమే. 1977 జనవరిలో సీపీఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ ఫార్వర్డ్ బ్లాక్, రివల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కలిసి వామపక్ష కూటమిగా ఏర్పడ్డాయి. 1977 జూన్ లో జరిగిన ఎన్నికల్లో ఈ కూటమి పోటీచేసి ఘనవిజయం సాధించింది. అప్పటినుంచి వరుసగా ఏడుసార్లు రాష్ట్రంలో గెలుపొందుతూ వచ్చింది. జ్యోతిబసు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించగా… రెండుసార్లు బుద్ధదేవ్ భట్టాచార్య సీఎంగా పనిచేశారు. 34 ఏళ్ల వామపక్ష కూటమి సుదీర్ఘ పాలనకు 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెరపడింది. తృణమూల్ కాంగ్రెస్ గెలుపొంది మమతాబెనర్జీ ముఖ్యమంత్రి అయ్యారు. వచ్చేఎన్నికల్లో కూడా విజయం సాధిస్తే వామపక్ష కూటమిలానే వరుసగా ఏడుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీగా బీజేపీ లెఫ్ట్ రికార్డును సమం చేస్తుంది.