టీడీపీ ఎంపీల సస్పెన్షన్ కూడా పద్దతిగా !

Bjp Plans To Suspend TDP MPS

ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో పేర్కొన్న హక్కుల విషయంలో రాష్ట్ర ప్రజలను మోసం చేసిందనే కారణంతో భారతీయ జనతా పార్టీని దూరం పెట్టి ఎన్డీయే నుండో బయటకు వచ్చింది తెలుగుదేశం పార్టీ. అప్పటి నుంచి ప్రత్యక్షంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. చంద్రబాబు ఏపీలోని జిల్లాల్లో ధర్మ పోరాట దీక్షలు చేస్తూ బీజేపీ చేసిన మోసాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే పార్లమెంట్ సమావేశాల సమయంలో ఆ పార్టీ ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభల్లో తమ వాణిని వినిపిస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాలుగా ఉభయ సభల్లో ఇదే తంతు నడుస్తోంది. అయితే గత సమావేశాల సమయంలో టీడీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టారు. దీంతో సభలో ఏపీ సమస్యలను వివరించే అవకాశాన్ని దక్కించుకున్నారు. అయినా, మోదీ ప్రభుత్వం కనికరించకపోగా, సాయాన్ని కూడా పూర్తిగా నిలిపివేసింది.

ఈ కారణంతో ఆ ఎంపీలు సభలో ఆందోళన చేస్తూనే ఉన్నారు. గురువారం కూడా సభ మొదలవగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై ఆగ్రహించిన స్పీకర్ టీడీపీ ఎంపీలను సస్పెండ్ చేశారు. ఎంపీలను సస్పెండ్ చేయడం పెద్ద విషయమేమీ కాకపోయినా టీడీపీ ఎంపీల సస్పెన్షన్ అనేది ఇప్పుడు చర్చనీయాంశమే. ఎందుకంటే ఈ రెండు పార్టీల మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. అందుజే వారిని సస్పెండ్ చేశారనే అనుమానాలు తలెత్తకుండా ఇటీవల జరిగిన బీఎస్సీ సమావేశంలో జనవరి 1 నుంచి వెల్‌లోకి వచ్చి నిరసన వ్యక్తం చేసే వారిని సస్పెండ్ చేయాలంటూ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా బుధవారం కావేరి జలాలపై ఆందోళనకు దిగిన 24 మంది అన్నాడీఎంకే ఎంపీలను ఐదు రోజుల పాటు సస్పెండ్ చేశారు. గురువారం టీడీపీకి చెందిన ఎంపీలను సస్పెండ్ చేశారు. టీడీపీ ఎంపీలను సస్పెండ్ చేయడానికి ముందే తమతో సన్నిహితంగా మెలిగే అన్నాడీఎంకే ఎంపీలను సస్పెండ్ చేశారు. అంటే టీడీపీ వాళ్లను సస్పెండ్ చేయడం కోసం ఒకరోజు ముందే అన్నాడీఎంకే ఎంపీలపై చర్యలు తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.