ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స్థానిక ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం

BJP wins in Uttar Pradesh Municipal Corporation Elections 2017

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో అధికార బీజేపీ మ‌రోసారి త‌న ప‌ట్టు నిరూపించుకుంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన‌ యోగి ఆదిత్య‌నాథ్ త‌నకు ఎదురైన తొలి స‌వాల్ లో అద్భుత విజ‌యం సాధించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీజేపీ విజ‌య దుందుభి మోగించింది. ఎంత‌గా అంటే… కాంగ్రెస్ కంచుకోట‌లు, అధ్య‌క్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ నియోజ‌క‌వ‌ర్గాలు రాయ్ బ‌రేలీ, అమేథీల‌లో సైతం బీజేపీనే గెలుపు ఢంకా మోగించింది. న‌వంబ‌ర్ 22, 26, 29న మూడు విడ‌ద‌లుగా 652 పుర‌పాల‌క స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. వాటిలో 16 మేయర్, 198 న‌గ‌ర‌పాలిక ప‌రిష‌త్ లు, 438 న‌గ‌ర పంచాయితీలు ఉన్నాయి. 16 మేయ‌ర్ స్థానాల్లో 14సీట్ల‌లో బీజేపీ గెలుపొందింది. వార‌ణాసి, అయోధ్య‌, ల‌క్నో, గోర‌ఖ్ పూర్ , ఘ‌జియా బాద్, బ‌రేలీ, ఆగ్రా, ఫిరోజ్ బాద్, మ‌ధుర‌, కాన్పూర్, స‌హారాన్ పూర్, అల‌హాబాద్, మోరాబాద్ , ఝాన్సీ స్థానాల్లో బీజేపీ విజ‌యం సాధించ‌గా… మిగిలిన రెండు స్థానాలను బ‌హుజ‌న్ స‌మాజ్ వాదీ పార్టీ ద‌క్కించుకుంది. ఆక్సిజ‌న్ అంద‌క చిన్నారులు మృత్యువాత ప‌డ్డ గోర‌ఖ్ పూర్ ఆస్ప‌త్రి విషాదం ప్ర‌భావం స్థానిక ఫ‌లితాల‌పై ప‌డ‌లేదు.

Bjp-wins-Up-Civil-pollls

అలాగే తాజ్ మ‌హ‌ల్ పై బీజేపీ నేత‌లు చేస్తున్న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌నూ అక్క‌డి ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేదు. ఈ రెండు స్థానాల్లో కూడా బీజేపీనే గెలుపొంద‌డం విశ్లేష‌కులను సైతం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. స్థానిక ఫ‌లితాల‌పై ప్ర‌ధాని మోడీ హ‌ర్షం వ్య‌క్తంచేశారు. దేశంలో మ‌రోసారి అభివృద్దే విజ‌యం సాధించింద‌ని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు. భారీ విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టిన యూపీ ప్ర‌జ‌ల‌కు ట్విట్ట‌ర్ లో కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కు, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు శుభాకాంక్ష‌లు చెప్పారు. ప్ర‌జ‌ల అభివృద్ధి కోసం మ‌రింత క‌ష్ట‌ప‌డేలా ఈ విజ‌యం స్ఫూర్తినిస్తుంద‌ని సంతోషం వ్య‌క్తంచేశారు. అటు కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి మాత్రం ఈ ఎన్నిక‌లు షాకిచ్చాయి. బీజేపీ కంచుకోట గుజ‌రాత్ లో గెలుపుకోసం రాహుల్ ఓ ప‌క్క స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతోంటే… ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అమేథీలోనే యూపీ ప్ర‌జ‌లు కాంగ్రెస్ ను ఓడించ‌డం ద్వారా రాహుల్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లోనూ యూపీ ఫ‌లితాలే పున‌రావృతం అవుతాయ‌న్న ఆందోళ‌న కాంగ్రెస్ శ్రేణుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.