హౌస్ ఫుల్-4’కు చాలా బ్యాడ్ టాక్

హౌస్ ఫుల్-4’కు చాలా బ్యాడ్ టాక్

దీపావళి కానుకగా దేశవ్యాప్తంగా పెద్ద పెద్ద సినిమాలు చాలానే రిలీజయ్యాయి. తెలుగులో ఈసారి పండక్కి ఏ సినిమా లేదు కానీ.. తమిళం, హిందీలో భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తెలుగు సినిమాలు రేసులో లేకపోవడంతో తమిళ అనువాదాలు ‘బిగిల్’, ‘ఖైదీ’ తెలుగులో పెద్ద ఎత్తునే రిలీజ్ చేశారు. వీటిలో ‘బిగిల్’కు యావరేజ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ బాగున్నాయి. ‘ఖైదీ’ చిత్రానికి ఓపెనింగ్స్ అంత బాగా లేవు కానీ.. టాక్ చాలా బాగుంది. దాని వసూళ్లు పుంజుకోవడం ఖాయం. ఐతే ఈ రెండు సినిమాల్ని మించి హైదరాబాద్‌లో హిందీ చిత్రం ‘హౌస్ ఫుల్-4’కు వసూళ్లు రావడం విశేషమే. దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి ఓపెనింగ్స్ భారీగానే వచ్చినట్లు ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. దీనికి టాక్ కనుక బాగుంటే ఈజీగా రూ.300 కోట్ల క్లబ్‌లో చేరి బ్లాక్ బస్టర్ స్టేటస్ అందుకునేది.

కానీ ‘హౌస్ ఫుల్-4’కు చాలా బ్యాడ్ టాక్ వచ్చింది. ట్రైలర్ చూసి బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనుకుంటే.. చివరికిది డిజాస్టర్ అయ్యేల ా ఉంది. అంత నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు ఈ సినిమా గురించి. మామూలు సినిమాల్ని కూడా పొగిడేస్తాడని పేరున్న క్రిటిక్ కమ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ‘హౌస్ ఫుల్-4’కు 1.5 స్టార్స్ వేసి నిరాశాజనక చిత్రం అని తీర్పిచ్చాడు. కామెడీ కోసం విశ్వ ప్రయత్నం చేసి విఫలమయ్యారని పేర్కొన్నాడు. మిగతా క్రిటిక్స్ సైతం చాలా వరకు ఈ చిత్రానికి 2 లోపే స్టార్లు ఇచ్చారు. ఈ తరహా లౌడ్ కామెడీస్ ఒకప్పట్లా ఇప్పుడు వర్కవుట్ కావడం లేదన్నది ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాలతో రుజువైంది. ‘హౌస్ ఫుల్-4’ కూడా ఆ కోవలోనిదే. క్యారెక్టర్ల ఇంట్రడక్షన్ బాగున్నప్పటికీ.. ఆ తర్వాత అన్నీ తేలిపోవడంతో కామెడీ వర్కవుట్ కాలేదు. అక్షయ్ కుమార్ సైతం సినిమాను నిలబెట్టలేకపోయాడన్నది క్రిటిక్స్ మాట. మన రానా దగ్గుబాటి చేసిన క్యారెక్టర్ కూడా సరిగా పేలలేదు.