రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు

రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు

రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు తిరుపతిలో తీవ్ర కలకలం రేపింది. తిరుపతికి సమీపంలోని రేణిగుంట వద్ద రైలు పట్టాలపై ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చేతి వేళ్లు సహా కుడిచేయి భాగం అంతా ఛిద్రమై తీవ్ర రక్తస్రావ మైంది. ఒక డబ్బా పేలి ఈ ఘటన చోటుచేసుకున్నట్టు మహిళ చెబుతోంది.

స్థానికులు వెంటనే ఆ మహిళను హాస్పిటల్ కి తరలించారు. హుటాహుటిన పేలుడు ప్రాంతానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా రేణిగుంట రైల్వే స్టేషన్లో రైళ్ల రాకపోకల్ని కాసేపు నిలుపుదల చేశారు. నాటుబాంబు పేలినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బాలో ఉంచిన బాంబులు పేలాయా? లేక మరేదైనా కెమికల్ డబ్బా పేలుడు జరిగిందా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.