ఓదార్పు యాత్ర అనగానే వైసీపీ అధినేత జగన్ గుర్తుకు వస్తారు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాల్ని పరామర్శించడానికి ఆయన ఓదార్పు యాత్ర తలపెట్టి దాన్ని కాదన్న కాంగ్రెస్ హైకమాండ్ మీద కత్తిగట్టి వైసీపీ స్థాపించిన విషయం దగ్గర నుంచి అన్ని పరిణామాలు అందరికీ తెలిసినవే. ఇక ఆయన జైల్లో వున్నప్పుడు సోదరి షర్మిల ఓదార్పు యాత్రలో భాగం అయ్యారు. ఇప్పుడు 2019 ఎన్నికల కోసం జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు. దీంతో ఓదార్పు యాత్ర ఇప్పుడిప్పుడే జనం మర్చిపోతున్నారు. అలాంటిది ఈ ఎపిసోడ్ లో ఇప్పుడు అనూహ్యంగా బ్రదర్ అనిల్ పేరు వినిపిస్తోంది. దానికి కారణం లేకపోలేదు.
బ్రదర్ అనిల్ నేరుగా బయటకు రాకపోయినా ఓ మతబోధకుడిగా ఆయన రాష్ట్ర రాజకీయాల మీద తన ముద్ర వేయడానికి ప్రయత్నించారు. ఆ ప్రభావమే అప్పట్లో వై.ఎస్ కి వ్యతిరేకంగా కె.ఏ. పాల్ గొంతు ఎత్తడం. ఏదేమైనా వైసీపీ ఏర్పడ్డాక కూడా అనిల్ ఆ పార్టీని అధికారంలోకి తేవడానికి తన వంతు ప్రయత్నం చేశారు. కానీ జరిగింది వేరు. బ్రదర్ అనిల్ మీద అవినీతి ఆరోపణలు వచ్చినా వై.ఎస్ హయాంలో పట్టించుకోలేదు. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత బయ్యారం గనులు సహా వివిధ అంశాల్లో ఆయన స్పీడ్ కి బ్రేక్ పడింది. మొన్నామధ్య “ లక్ష్మీస్ ఎన్టీఆర్ “ సినిమా చేస్తానని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ ని అనిల్ పార్క్ హయత్ హోటల్ లో కలవడం సంచలనం రేపింది. ఇప్పుడు ఆయన అరకు వైసీపీ ఇన్ ఛార్జ్ కుంభా రవి కుమార్ ఇంటికి వెళ్లారు. తండ్రిని కోల్పోయిన రవి బాబుని బ్రదర్ అనిల్ పరామర్శించారు. ఈ ఫొటోల్ని రవి బాబు తన పేస్ బుక్ పేజీలో పెట్టారు. ఆ ఫోటోలు చూసిన వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు ఓదార్పు యాత్ర బ్రదర్ అనిల్ చేస్తున్నారని సరదాగా అంటున్నారు.