రమణ దీక్షితుల వెనుకున్న అనిల్ కీ బ్రదర్ అనిల్ కీ సంబంధమేంటి ?

borugadda anil related to brother anil

ఆయ‌న రమణ దీక్షితులు, దాదాపు పాతికేళ్లు ఒక్క క్షణం మనం ఆ అఖిలాండభువ‌నైక నాయకుడైన శ్రీవారిని చూస్తే చాలనుకునే ఆ దేవదేవునికి నిత్య పూజ‌లు చేసిన తిరులమ‌ల‌ ప్ర‌ధాన అర్చ‌కులు. స‌మాజంలోని ప్ర‌తి ఒక్క‌రితోనూ ద‌ణ్ణాలు పెట్టించుకునే రేంజ్‌లోఉన్నారు. అయితే, ఇటీవ‌ల ఆయ‌న తిరుమ‌ల వ్య‌వ‌హారాల‌పై పెనువివాదం సృష్టించారు. టీటీడీ చర్యల వల్ల ఆగ‌మం నాశ‌నం అవుతోంద‌ని, స్వామికి సేవ‌లు మృగ్య‌మ‌వుతున్నాయ‌ని పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు సంధించారు. మొత్తంగా దాదాపు 20 రోజుల పాటు మీడియాలో ప్ర‌ముఖంగా ఆయ‌న క‌నిపించారు. ఫిర్యాదు పేరుతో ఏకంగా ఆయ‌న వెళ్లి బీజేపీ జాతీయ సార‌థి అమిత్‌షాను క‌ల‌వ‌డం పెను సంచ‌ల‌నంగా మారింది. ఇక‌, వైసీపీ అధినేత జ‌గ‌న్‌తోనూ దీక్షితులు భేటీ కావ‌డం రాజ‌కీయంగా ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. తాజాగా హైద‌రాబాద్‌లో మ‌ళ్లీ ప్రెస్‌మీట్‌ పెట్టారు.

అయితే, ఈ ప్రెస్‌మీట్ ఇప్పుడు పెను దుమారాన్ని రేపింది. ఈ ప్రెస్ మీట్ సాక్షిగా రమణ దీక్షితులు క్రిస్టియన్ చారిటీ సంస్థలతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీపై మరోసారి మాట్లాడేందుకు రమణ దీక్షితులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని క్రిస్టియన్ ప్రతినిధి బోరుగడ్డ అనిల్ ఆర్గనైజేషన్ చేసినట్లు తెలుస్తోంది. సైమన్ అమృత్ ఫౌండేషన్ పేరుతో మత ప్రచార కార్యక్రమాలను అనిల్ నిర్వహిస్తున్నాడు. అయితే.. మీడియా సమావేశంలో రమణ దీక్షితులు వెనుక అనిల్ ఉండడం పలు సందేహాలకు తావిస్తోంది. అనిల్‌ పై అనేక నేరారోపణలు ఉన్నాయి. గతంలో అమరావతిలో భూ వివాదంలో డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప పేరు చెప్పుకొని పలు నేరాలకు పాల్పడ్డాడు. కొన్ని సెటిల్మెంట్లు చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తితో కలిసి ప్రెస్‌మీట్‌ పెట్టడం టీటీడీ వర్గాల్లోనే కాదు శ్రీవారి భక్తుల్లోనూ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తమయింది. లోటస్‌పాండ్‌కు వెళ్లి జగన్‌ను కలిసినా కొంత మంది రమణదీక్షితులను సమర్థించారు కానీ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి విషయంలో ఎవరూ ఆయనను వెనకేసుకొచ్చేందుకు సిద్ధపడటం లేదు. కారణం బోరుగడ్డ అనిల్ బ్యాక్‌గ్రౌండ్. గుంటూరు జిల్లా తాడికొండ స్టేషన్‌లో అనిల్‌పై రౌడీ షీట్ కూడా ఉంది. ఇంతటి నేర చరిత్ర కలిగిన వ్యక్తితో రమణ దీక్షితులుకి సంబంధం ఏంటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోటస్‌పాండ్ వెళ్లి జగన్‌ను కల్సినప్పుడే అన్యమతస్తుల ఇంటికి ఎలా వెళ్తారనే విమర్శలు వచ్చాయి. అయినా రమణ దీక్షితులు తనను తాను సమర్థించుకున్నారు. తన పొట్ట ఎవరు నింపితే వారిని కలుస్తానని ప్రకటించుకున్నారు. ఇప్పుడు నేరుగా మత ప్రచార సంస్థ నిర్వాహకులతో కలిసి ప్రెస్‌మీట్ నిర్వహించడం అన్ని వర్గాలలోను తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

రమణదీక్షితులును రాజకీయంగా అడ్డుపెట్టుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే బోరుగడ్డ అనిల్‌ను రమణదీక్షితుల దగ్గరకు చేర్చిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ బోరుగడ్డ అనిల్ వైఎస్ వివేకానందరెడ్డికి కొంచెం దూరపు చుట్టమని అదే విధంగా బ్రదర్‌ అనిల్‌తోనూ అతనికి సంబంధాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల రమణదీక్షితులు లోటస్‌పాండ్‌కు వెళ్లి చర్చలు జరిపినప్పుడు రమణదీక్షితులకు సాయం చేయడానికి వైసీపీ తమ తరుపున ఆ బాధ్యతలు ఈ బోరుగడ్డ అనిల్‌కు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అప్పటి నుంచి వైసీపీ నుంచి వచ్చే సూచనలు, సలహాల ప్రకారం రమణదీక్షితుల రాజకీయంగా ఎలాంటి ప్రకటనలు చేయాలి తర్వాతి కార్యాచరణ ఏమిటన్నది ఈ అనిల్ పర్యవేక్షిస్తున్నట్లు కొన్ని మీడియా వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఏది ఏమయినా హిందువులంతా చేతులెత్తి నమస్కరించే పొజిషన్లో ఉన్న వ్యక్తి ఇప్పుడిలా క్రైస్తవ మత ప్రచారకుడి వెంటేసుకుని తిరగడం అనేక విమర్శలకు తావిస్తోంది.