బెల్లంకొండను బుక్‌ చేసిన తేజ

bellamkonda srinivas next movie with Director teja

కొన్ని సంవత్సరాల క్రితం ప్రేమ కథలకు పెట్టింది పేరు అయిన దర్శకుడు తేజ తెలుగు సినిమా పరిశ్రమకు ఎంతో మంది నటీనటులను అందించాడు. ఎంతో మంది స్టార్స్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ఘనత తేజకు దక్కుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వరుసగా తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు అన్నట్లుగా, కాలం అడ్డం తిరిగింది. తేజ కెరీర్‌ కష్టాల్లో కూరుకు పోయింది. వరుసగా ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతూ వచ్చాయి. దాంతో చేసేది లేక కొంత కాలం గ్యాప్‌ తీసుకున్నాడు. ఇటీవలే ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రాన్ని చేసి సక్సెస్‌ను దక్కించుకున్నాడు.

ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో దర్శకుడు తేజకు ‘ఎన్టీఆర్‌’ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశం దక్కింది. ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అలాంటి సినిమాకు దర్శకత్వ ఛాన్స్‌ అంటే మామూలు విషయం కాదు. తేజ దర్శకత్వంకు అంతా రెడీ అయిన సమయంలో సినిమా నుండి ఆయన తప్పుకున్నాడో లేదా బాలయ్య తప్పించాడో కాని ఎన్టీఆర్‌ నుండి తేజ బయటకు వచ్చేశాడు. ఇప్పుడు తేజ యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా ఒక చిత్రాన్ని చేసేందుకు స్క్రిప్ట్‌ సిద్దం చేస్తున్నాడు. ఇటీవలే సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్‌ను శ్రీనివాస్‌కు చెప్పడం, ఆయన ఓకే చెప్పడం జరిగిపోయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న వీరి కాంబో మూవీ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌ సాక్ష్యం మరియు మరో సినిమాను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఇదే సంవత్సరంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.