రాతి మనసు కరిగింది !

Donald Trump signs executive order to end separation of immigrant families

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మొండి పట్టు వీడారు. తన బండ రాయి లాంటి హృదయం కరిగి తన తలతిక్క నిర్ణయం నుంచి వెనక్కు తగ్గారు. అమెరికా- మెక్సికో సరిహద్దుల్లో అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలోకి వస్తున్న కుటుంబాలలోని తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చేయడంపై ప్రపంచవ్యాప్తంగా సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో అధ్యక్షుడు ట్రంప్ తన మనస్సు మార్చుకున్నారు. వేరుచేయడంపైఅక్రమ వలసదారుల కుటుంబాలను విడదీసి తల్లిదండ్రులను – పిల్లలను వేరుచేయకుండా ఆ విధానానికి స్వస్తి పలుకుతూ ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకాలు చేశారు. అయితే వలస విధానం విషయంలో ఏ మాత్రం తగ్గబోమని అయితే మానవతా దృక్పదంతో ఇకపై కుటుంబాలను కలిపే ఉంచుతామని స్పష్టం చేశారు. అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలో ప్రవేశించినందుకు కుటుంబమంతా ప్రాసిక్యూషన్ ఎదుర్కునేలా చర్యలు చేపడుతామని అన్నారు.

తమ సరిహద్దులు ఇప్పుడు మరింత పటిష్టంగా ఉన్నాయి. కుటుంబాలను సమిష్టిగా ఉంచాల్సిన బాధ్యత మాపై ఉంది అని సంతకాలు చేసిన అనంతరం ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే వలసలపై తమ కఠిన వైఖరిని పదేపదే సమర్థించుకుంటున్న ట్రంప్ వలస వచ్చిన చిన్నారులను సరిహద్దులు దాటిన అనంతరం తల్లిదండ్రుల నుంచి బలవంతంగా వేరు చేశారు. గత రెండు నెలల కాలంలో అక్రమంగా సరిహద్దులు దాటివచ్చిన కుటుంబాలకు చెందిన 2500 మంది పిల్లలను వారి తల్లిదండ్రుల నుంచి విడదీసి శిబిరాలకు తరలించారు. అందులో చిన్నారులు కంటతడి పెట్టే దృశ్యాలు, వారిని బోనుల్లో నిర్భందించిన ఫొటోలు బయటకు రాగా.. వాటిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికా ఫస్ట్‌లేడి మెలానియా ట్రంప్ సైతం డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసింది.