రమణ దీక్షితులుకి చంద్రబాబు జూనియర్….తెల్ల జెండా ఎగిరింది.

TTD Priest ramana deekshitulu praises Chandrababu

ఒకాయనేమో రాజకీయాల్లో 40 ఏళ్లుగా బిజీ బిజీ. ఇంకొకాయనేమో శ్రీవారి సేవ లో కొన్ని దశాబ్దాలుగా తరించిన వ్యక్తి. ఈ ఇద్దరికీ పొంతన పెట్టి మాట్లాడే పరిస్థితులు వస్తాయని ఏ ఒక్కరూ ఊహించలేదు. కానీ ఆ పరిస్థితి వచ్చింది. రాజకీయం కారణంగా . ఏపీ లో అనూహ్య పరిణామాలు వుంటాయని హెచ్చరించిన బీజేపీ నిజంగానే కొన్ని ఊహించని పరిస్థితులు తెచ్చిపెట్టింది. శ్రీవారి గుడిని సైతం ఇందుకు వాడుకుంది. అందులో భాగం అయిన రమణ దీక్షితులు ఢిల్లీ అండ వుంది కదా అని రెచ్చిపోయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఇష్టారాజ్యంగా ఆరోపణలు గుప్పించారు. దీంతో తనకు ఏదో లబ్ది చేకూరుతుందని భావించారు. కానీ రమణ దీక్షితుల ఆరోపణల్ని భక్తులు రాజకీయ కోణం నుంచే చూడడంతో సీన్ మారిపోయింది. ఆయన ఉద్యోగానికి ఎసరు వచ్చింది. కేంద్రం తనకు అండగా ఉంటుంది అనుకుంటే అవసరం తీరాక ఆయన ఊసు కూడా ఎత్తలేదు. అటు వైసీపీ అధినేత జగన్ ని కలిసినా రాజకీయ ముద్ర పడడం తప్ప ఒరిగిందేమీ లేదు. ఇంత అనుభవం అయ్యాక గానీ రమణ దీక్షితులకి తత్వం బోధపడలేదు.

శ్రీవారి ఆలయ పూజారిగా తాను నోరు విప్పితే భూమి బద్దలు అవుతుందని భావించిన రమణదీక్షితులకి నిజం ఏమిటో కాస్త ఆలస్యంగా అయినా అర్ధం అయ్యింది. అందుకే చెన్నై వేదికగా ఆయన మాటల్లో చాలా తేడా వచ్చేసింది. తన వాదనకు ప్రజలు , సాటి పురోహితుల నుంచి పెద్దగా మద్దతు రాలేదని పరోక్షంగా ఆయన అంగీకరించారు. అక్కడితో ఆగకుండా చంద్రబాబు మనసులో తనపై మంచి అభిప్రాయమే ఉంటుందని , కావాలని కొందరు ఆయనకు తప్పుడు మాటలు చెబుతున్నారని రమణ దీక్షితులు అన్నారు. ఓ విధంగా చెప్పాలంటే టీడీపీ సర్కార్ తో సంధికి తెల్ల జెండా ఊపేసారు. తాను , చంద్రబాబు ఇద్దరం శ్రీవారి భక్తులమే అని చెప్పుకున్న రమణదీక్షితులు కొండపై అంతా సవ్యంగా ఉండాలన్నదే ఇద్దరి అభిమతం అని చెప్పుకొచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో హైలైట్ ఏంటంటే ఎస్వీ యూనివర్సిటీ లో చంద్రబాబు తనకు జూనియర్ అని రమణదీక్షితులు పాత విషయాలు తిరగదోడడం.

ఇప్పుడు చంద్రబాబు దగ్గర తెల్ల జెండా ఊపడం కోసం రమణ దీక్షితులు చెప్పిన ప్రతి మాట నిజమే కావొచ్చు. అయితే ఇంతకు ముందు కూడా ఈ విషయాలు మొత్తం తెలిసిన మనిషిగా , అన్నిటికన్నా ముఖ్యంగా శ్రీవారి సేవలో తరించే భాగ్యం కలిగిన వ్యక్తిగా టీటీడీ గురించి ఇంత రచ్చ చేయడం రమణ దీక్షితుల వంటి వారికి తగునా ? . ఇప్పుడు ఎటూ నిజం ఒప్పుకున్నారు కాబట్టి మొత్తం ఎపిసోడ్ లో తనని రాష్ట్ర సర్కార్ మీదకు ఉసిగొలిపిన రాజకీయ శక్తులు గురించి బయటపెడితే బాగుంటుంది.