అక్కా అని పిలిచి లిఫ్ట్ ఇచ్చి…రేప్ చేయబోయాడు

called her as sister and attempted to rape

అక్కా అని ఆప్యాయంగా పిలిచి లిఫ్ట్‌ ఇస్తానంటే నమ్మి వెళ్ళిన ఆమె రేప్ కి గురికాబోయి బయట పడింది. పోలీసుల కథనం మేరకు, క్రష్ణా జిల్లా కంకిపాడు మండలం గొడవర్రు గ్రామానికి చెందిన యువతి కంకిపాడులోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. బుధవారం రాత్రి డ్యూటీ నిమిత్తం కంకిపాడు వెళ్లేందుకు గ్రామంలో ఆటో కోసం వేచి ఉండగా అదే గ్రామానికి చెందిన చోరగుడి రవీంద్ర ఆమె వద్దకు వచ్చాడు. ‘అక్కా, నేను కూడా కంకిపాడు వెళ్తున్నా, బండి ఎక్కితే డ్రాప్‌ చేస్తా’నని చెప్పాడు. పరిచయం ఉన్న వాడే కదా అని నమ్మి ఆ యువతి అతని బండి ఎక్కింది. కంకిపాడు లాకుల వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా వాహనం వేగాన్ని పెంచిన అతను గోసాల వైపు వెళ్లడం ప్రారంభించాడు. దీంతో అనుమానించిన ఆ యువతి వాహనాన్ని ఆపాలని కోరింది. అయినా పట్టించుకోకుండా అతను మరింత వేగంగా పొలాల వైపు వెళ్తుండడంతో ఆమె గట్టిగా కేకలు వేస్తూ ‘బండి ఆపకుంటే దూకేస్తాను’ అంటూ బెదిరించింది. అయినా అతను ఆపకపోవడంతో గట్టిగా కేకలువేస్తూ వాహనంపై నుంచి దూకేసింది. ఆమె కేకలు విని చుట్టుపక్కల పనుల్లో ఉన్న వారు వచ్చి తీవ్రంగా గాయపడిన బాధితురాలిని రక్షించారు. రవీంద్రను పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.