కరోనా దెబ్బకి.. ఇంట్లోనే మన స్టార్స్ విన్యాసాలు

కరోనా ప్రభావంతో ప్రపంచమంతా వణికిపోతుంది. ఎంతటివారైనా సరే ఇంటికే పరిమితమౌతున్నారు. అందులో సెలబ్రిటీలు అయితే దొరక్క దొరక్క దొరికిన సమయాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది కుటుంబంతో గడుపుతూ సామాజిక స్పృహను ప్రజలలో పెంచి జనాన్నిచైతన్యపరుస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో అన్ని రంగాలకి చెందిన పరిశ్రమలు అన్నీ మూతపడ్డాయి. ఇదే సమయంలో కొంతమంది స్టార్స్ వంట చేస్తుంటే మరికొంతమంది ఇంటి పనులు చేసుకుంటూ ఉన్నారు. మరికొందరు స్క్రిప్ట్ రాసుకుంటూ ఉంటే.. ఇంకొందరు పూర్తిగా పిల్లలతో ఆడుకుంటూ కనిపిస్తున్నారు. సహజంగా సినిమాకు.. సినిమాకు మధ్యలో వచ్చే విరామంలో ఫ్యామిలీతో హాలీడే ట్రిప్‌లు సినీస్టార్స్. కానీ…. ఇంట్లోనే భార్య, పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించలేరు.

అయితే, కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా విధించిన 21 రోజుల లాక్‌డౌన్ సినిమా హీరోలను తమ ఫ్యామిలీకి బాగా దగ్గర చేసిందని చెప్పుకోవచ్చు. ఈ 21 రోజులూ ఇంట్లోనే ఖాళీగా ఉండే హీరోలు భార్య, పిల్లలతో సమయాన్ని గడుపుతున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని తన కుమారుడు జున్ను (అర్జున్)తో ఆడుకుంటూ మధుర క్షణాలను గడుపుతున్నారు. ఈరోజు (మార్చి 29)న జున్ను మూడో పుట్టినరోజు. ఈ సందర్భంగా జున్నుకి నాని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘హ్యాపీ బర్త్‌డేరా జున్ను’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌లో జున్నును ముద్దాడుతున్న ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. ఆ తరవాత కాసేపటికి ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు నాని. ఈ వీడియో చాలా క్యూట్‌గా వైరల్ అవుతుంది.

ఇంకా కరోనా దెబ్బ సినీ, టెలివిజన్‌ రంగాలపై బాగా పడిందనే చెప్పాలి. లాక్‌డౌన్‌ వల్ల సినిమా, టీవీ షూటింగ్‌లన్నీ నిలిచిపోయాయి. షూటింగ్‌లు ఆగిపోవడం వల్ల రోజువారీ వేతనాలకు పనిచేసే కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో సిసీ కార్మికులను ఆదుకునేందుకు కొంతమంది హీరోలు ముందుకొచ్చి రూ.కోట్లల్లో విరాళాలు ప్రకటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ‘కరోనా క్రైసస్ ఛారిటీని ప్రారంభించారు. ఈ చారిటీకి ఇప్పటికే చిరు రూ.కోటి రూపాయలు ఇవ్వగా.. నాగార్జున రూ. కోటి, మహేష్ బాబు రూ.25లక్షలు, ఎన్టీఆర్ రూ.25లక్షలు, ఎన్టీఆర్ రూ.30లక్షలు అందించారు. అలాగే నాగ చైతన్య రూ.25లక్షలు, యంగ్ హీరో కార్తికేయ రూ.2 లక్షలు తమ తరపున విరాళాలు అందజేశారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు ప్రముఖ యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు. తనకు తెలిసిన 60 మంది టెలివిజన్‌ కార్మికులకు ఒక నెలకు సరిపడా ఆర్థికసాయం చేస్తాననని ప్రకటించారు. అంతేకాకుండా స్థోమత ఉన్నవారు ముందుకు వచ్చి తమ చుట్టుపక్కల వారికి తోచిన సాయాన్ని అందించాలని కోరారు.

అలాగే ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రజలు బయటకు రాకుండా డ్రోన్ కెమెరాకు దెయ్యం బొమ్మ తగిలించి వీడియో ట్విట్టర్ లో షేర్ చేశారు. లాక్ డౌన్ సమయంలో ఆర్మీ, పోలీస్ ఆఫీసర్స్ ఎవరు అక్కర్లేదని.. ఈ పని చేస్తే.. తక్కువ ఖర్చు మరింత ఉపయోగంగా ఉంటుందని పూరీ తెలిపారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తనదైనశైలిలో ఇంట్లో అంట్లు తోముతూ, ఇల్లు ఊడుస్తూ రకరకాల విన్యాసాలు చేస్తుంది. మొత్తానికి కరోనా ప్రభావంతో మన స్టార్స్ విన్యాసాలు మామూలుగా లేవుగా.