ఎస్సీ, ఎస్టీ చట్టం మీద కేంద్రం కీలక నిర్ణయం !

Central government crucial decision on SC ST Atrocity case

ఎస్సీ, ఎస్టీ చట్టం మీద జరుగుతున్న ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంపై రేగిన దుమారానికి కేంద్ర మంత్రివర్గం ముగింపు పలికింది. నిన్న సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ చట్టం దుర్వినియోగమవుతోందంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన తీర్పు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేపింది. అనేక దళిత, ప్రజా సంఘాలు నిరసన తెలిపాయి. గతంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదైన పక్షంలో తక్షణమే అరెస్టు చేసే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉండేది. తాజాగా సుప్రీంకోర్టు తక్షణ అరెస్టులు అవసరం లేదని, ఫిర్యాదుదారుల ఆరోపణల్లో నిజం ఉందని దర్యాప్తు సంస్థ సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతనే అరెస్టు చేయాలని పేర్కొనడంతో దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

కొన్ని రాష్ట్రాల్లో ఆందోళనకు హింసాత్మకంగా మారి పలువురు మృత్యువాత పడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా పలు రాజీకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చా యి. అధికార ఎన్డియేలో భాగస్వా ములైన లోక్‌జనశక్తి పార్టీ, ఆర్పీఐ వంటి రాజకీయ పక్షాలు కోడా ఈ అంశం మీదా ఒత్తిడి తీసుకురావడంతో ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్ట సవరణకు కేంద్ర మంత్రిర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ రాజ్యాంగ సవరణకు పార్లమెంటు ఆమోదం లభిస్తే ఈ విషయంలో సుప్రీంకోర్టు మార్చి 20న ఇచ్చిన తీర్పు చెల్లుబాటు కాకుండా పోతుంది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఈ తీర్పునిచ్చిన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోయల్‌ను నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌కు చైర్మన్‌ గా నియమించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఎన్డియే ప్రభుత్వం దళిత వ్యతిరేకి అంటూ రాజకీయ పార్టీలు దుమ్మెత్తిపోశాయి. ఈ నేపథ్యంలో ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే ఉద్దేశమేదీ తమకు లేదని కేంద్ర ప్రభుత్వం తరఫున పలువురు ప్రకటనలు చేశారు. తాజాగా కేంద్ర కేబినెట్‌ ఈ మేరకు చట్టాన్ని మళ్ళీ పటిష్టం చేస్తూ నిర్ణయం తీసుకుంది.