ఏపీ భూసేక‌ర‌ణ బిల్లుకు ఆమోదం ల‌భించిన‌ట్టే…

Central govt accept Land Acquisition act 2017 Bill in AP

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్ర‌ప్ర‌దేశ్ భూసేక‌ర‌ణ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం అంగీకారం తెలిపిన‌ట్టు స‌మాచారం. 2013 కొత్త భూసేక‌ర‌ణ చ‌ట్టానికి ప‌లు స‌వ‌ర‌ణ‌లు చేస్తూ 2017 నవంబ‌ర్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కొత్త బిల్లును తీసుకువ‌చ్చింది. బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్ర‌ప్ర‌భుత్వం, రాష్ట్ర‌ప‌తి ఆమోదానికి పంపింది. కేంద్ర ప్ర‌భుత్వ శాఖ‌లు బిల్లుపై లేవనెత్తిన ప‌లు సందేహాల‌ను రాష్ట్ర అధికారులు నివృత్తి చేయ‌డంతో… ఆమోదానికి మార్గం సుగ‌మ‌మ‌యింది. రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన ప‌లు ప్ర‌తిపాదన‌ల‌కు మూడు రోజుల క్రిత‌మే కేంద్ర న్యాయ‌శాఖ ఆమోదం తెలిపిన‌ట్టు సంబంధిత వ‌ర్గాలు చెబుతున్నాయి.

కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ అధికారుల‌తో సంప్రదింపులు జ‌రిపి ఆమోద ముద్ర వేసిన‌ట్టు తెలుస్తోంది. వెంట‌నే న్యాయ‌శాఖ ఆ బిల్లును హోంమంత్రిత్వ శాఖ‌కు పంప‌గా… శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం హోం శాఖ కార్య‌ద‌ర్శి సంత‌కం చేసిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం బిల్లు హోం శాఖ సహాయ‌మంత్రి హ‌న్స‌రాజ్ గంగారాం ద‌గ్గ‌ర ఉంది. సోమ‌వారం త‌ర్వాత ఇది ప్ర‌ధాని కార్యాల‌యానికి పంపి దీనిపై తుదినిర్ణ‌యం తీసుకుని, రాష్ట్ర‌ప‌తి ఆమోదం కోసం పంప‌నున్నారు. ఈ వారంలో దాదాపు ఆమోదం తెలిపే అవ‌కాశం ఉన్న‌ట్టు ఏపీ అధికార వ‌ర్గాలు ఆశాభావం వ్య‌క్తంచేస్తున్నాయి. హోంశాఖ కార్య‌ద‌ర్శి సంత‌కం ఇప్ప‌టికే పూర్త‌వ‌డంతో మిగ‌తా ప్ర‌క్రియంతా త్వ‌రిత‌గ‌తిన పూర్త‌వుతుంద‌ని హోం శాఖ వ‌ర్గాలు భావిస్తున్నాయి.