కులమే ముఖ్యం….జడ్జి గారి కులమేంటో?

మనిషి వేరే గ్రహాల మీద నివసించే అంత టెక్నాలజీని అభివృద్ధి చేసుకున్నా కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం తుచ్చంగానే ఆలోచిస్తూ ఉంటారు. అదేమిటో కానీ మిగతా వాళ్ళతో పోలిస్తే భారతీయులకి ఆ పాళ్ళు ఇంకా ఎక్కువ. ఒక వ్యక్తి ఏదైనా గొప్ప పని చేసినా, ఏదైనా విజయం సాధించినా ఆ వ్యక్తి అది సాధించడానికి ఎంత కష్టపడ్డాడు అని తెలుసుకోవడం మానేసి ఆ వ్యక్తి మన కులం వాడేనా అని తెలుసుకునే దౌర్భాగ్య స్థితికి దిగాజారుతున్నారు జనాలు. తాజాగా హైకోర్టు విభజన జరిగిన విషయం తెలిసిందే. జనవరి 1 వ తేదీ నుంచి ఏపీ, తెలంగాణకు విడివిడిగా హైకోర్టులు ఉంటాయి. ఏపీ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు.

కులమే ముఖ్యం....జడ్జి గారి కులమేంటో? - Telugu Bullet

ఆయన నియామకం అలా జరిగిందో లేదో ఆయన కులాన్ని తెలుసుకునేందుకు నెటిజన్లు ఎంతగా ఆరాటపడ్డారో తెలిస్తే షాక్ అవుతారు. ఆయన కులం ఏంటో కనిపెట్టేందుకు తెలుగువారు, దేశ ప్రజలే కాదు విదేశాల్లో ఉంటున్న ఎన్నారైలు సైతం గూగుల్ ని ఆశ్రయించారంటే ఆశ్చర్యం కలగకమానదు. ఆయనది ఏ కులం అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఒకరు కాదు ఇద్దరు కాదు.. కేవలం ఒక్క రోజులోనే ఏకంగా 15 లక్షల మంది గూగుల్ లో సెర్చ్ చేసారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. అంతే కాదు 15 లక్షల మందిలో దాదాపు 5 లక్షల మంది అమెరికా, యూరప్, లండన్ లాంటి దేశాల నుండి గూగుల్లో సెర్చ్ చేశారని అనలిటిక్స్ చెబుతున్నాయి. గొప్ప గొప్ప చదువులు చదువుకొని విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న ప్రవాస భారతీయులు కూడా కుల పిచ్చితో ఉంటే ఏమనాలి ? నిర్వేదంతో జై గూగుల్ తల్లి అని తప్ప. మన వాళ్ళ వెర్రి ముదురి గూగుల్ తల్లిది ఏమి కులమని అడిగినా అడుగుతారు ఏమో ?