జైట్లీ ఆవిషయంపై మాట మారుస్తున్నారు… చంద్ర‌బాబు

Chandrababu comments on Arun Jaitley over Ap Special Status

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సెంటిమెంట్ తో డ‌బ్బులురావ‌ని చెబుతున్న కేంద్ర‌మంత్రి అరుణ్ జైట్లీకి… సెంటిమెంట్ తోనే రాష్ట్రాన్ని విభజించిన సంగ‌తి గుర్తులేదా… అని ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. విభ‌జ‌న చ‌ట్టం అమ‌లుపై శాస‌న‌స‌భ‌లో చేప‌ట్టిన చ‌ర్చలో మాట్లాడిన ముఖ్యమంత్రి కేంద్రం తీరును దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌త్యేక హోదాకు వ‌చ్చే ప్ర‌యోజ‌నాల‌న్నీ ఇస్తామ‌ని హామీఇస్తేనే ఆనాడు ప్ర‌త్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామ‌ని చంద్ర‌బాబు వెల్ల‌డించారు. ప్ర‌త్యేక హోదా వ‌ల్ల పెద్ద‌గా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని బీజేపీ నేత‌లు చెప్ప‌డం స‌రికాద‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. న‌ల‌భైఏళ్ల‌గా రాజ‌కీయాల్లో ఉన్నాన‌ని, దేశంలో సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌ల్లో తానూ ఒక‌రిన‌ని, తొమ్మిదేళ్లు ముఖ్య‌మంత్రిగా, ప‌దేళ్లు ప్ర‌తిప‌క్ష‌నేత‌గా, మ‌ళ్లీ నాలుగేళ్ల నుంచి సీఎం గా ఉన్నాన‌ని, రాష్ట్రానికి సంబంధించి త‌న‌కంటే ఎవ‌రికీ ఎక్కువ తెలియ‌ద‌ని ముఖ్య‌మంత్రి వ్యాఖ్యానించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పక్క రాష్ట్రాల‌తో స‌మానంగా అభివృద్ధి సాధించేవ‌ర‌కు ఆదుకోమ‌నికేంద్రాన్ని కోరుతున్నాన‌న్నారు.

కేంద్రం సాయం వ‌ల్లే రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించింద‌ని బీజేపీ నేత‌లంటున్నార‌ని, మ‌రి బీజేపీ ప్ర‌భుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి ఎందుకు జ‌ర‌గ‌డం లేద‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌శ్నించారు. టీడీపీ ప్ర‌భుత్వం క‌ష్ట‌ప‌డుతోంది కాబ‌ట్టే అభివృద్ధి సాధించ‌గ‌లుగుతున్నామ‌ని సీఎం తెలిపారు. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ప్పుడు కాంగ్రెస్ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చి త‌ల్లిని పురిట్లోనే చంపేసింద‌ని, తాము అధికారంలో ఉంటే రెండు రాష్ట్రాల‌కు స‌మాన న్యాయం చేసేవాళ్ల‌మని మోడీ అన్నార‌ని… అధికారంలోకి వచ్చిన త‌ర్వాత కాంగ్రెస్ లానే ప్ర‌వ‌ర్తించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. విభ‌జ‌న త‌ర్వాత రెవెన్యూ లోటు 16 వేల కోట్లుగా కాగ్, ఆర్థిక సంఘం నిర్ధారించాయ‌ని, 2014-15 బ‌డ్జెట్ లోనే ఆ నిధులు కేటాయించాల‌ని ఆర్థిక సంఘం సూచించింద‌ని, అయినా ఆ ఏడాది బ‌డ్జెట్ లోనే నిధులు ఎందుకు మంజూరు చేయ‌లేద‌ని ముఖ్య‌మంత్రి నిల‌దీశారు. అసంబద్ధంగా రాష్ట్రాన్ని విభ‌జించిన కాంగ్రెస్ ను ప్ర‌జ‌లు తుడిచిపెట్టేశార‌ని, ఆ ప‌రిస్థితి మ‌రెవ‌రికీ రాకూడ‌ద‌ని కోరుకుంటున్నాన‌ని చంద్ర‌బాబు అన్నారు. విభ‌జ‌న చ‌ట్టం, ప్ర‌త్యేక హోదా ఐదుకోట్ల ఆంధ్రుల హ‌క్క‌ని, ఎన్టీఆర్ ఆంధ్రుల‌కు ఆత్మ‌గౌర‌వం ఇస్తే… తాను ఆత్మ‌విశ్వాసం ఇచ్చాన‌ని ముఖ్య‌మంత్రి చెప్పారు.

తాను ఎలాంటి లాబీయింగ్ కు పాల్ప‌డ‌లేద‌ని, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలే త‌న‌కు ముఖ్య‌మని స్ప‌ష్టంచేశారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో కేంద్రాన్ని అడ‌గ‌డానికి రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు మొహ‌మాటం ఉందేమో కానీ త‌న‌కు లేద‌ని, తేల్చిచెప్పారు. సీమాంధ్ర రెవెన్యూలోటును త‌ప్ప‌కుండా భ‌ర్తీచేయాల‌ని రాజ్య‌స‌భ‌లో ఆనాడు ప్ర‌తిపక్ష నేత‌గా ప్ర‌క‌ట‌న చేసిన జైట్లీ ఆర్థిక‌మంత్రి అయిన త‌ర్వాత ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో చూడండ‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు.