జగన్ గృహ ప్రవేశం…బాబు సంచలన వ్యాఖ్యలు !

Chandrababu

గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ నూతనంగా నిర్మించుకున్న ఇంటిలోకి బుధవారం గృహప్రవేశం చేశారు. ఉదయం 8.19 గంటలకు జగన్, భారతి దంపతులు నూతన ఇంట అడుగుపెట్టారు. అలాగే ఆ ఇంటిపక్కనే నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని కూడా జగన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు వైఎస్‌ విజయమ్మ, షర్మిల, అనిల్‌ కుమార్‌లతోపాటు పలువురు వైసీపీ నేతలు, నియోజకవర్గాల సమన్వయకథలు పాల్గొన్నారు. అయితే జగన్‌ కొత్త భవనంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఉదయం పలువురు టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని విషయంలో వైసీపీ అనుమానాలు సృష్టిస్తోందని సీఎం మండిపడ్డారు.

రాజధాని అమరావతిలోనే అని మేనిఫెస్టో‌లో పెడతారట, ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. నాలుగేళ్లుగా మన గడ్డ మీద నుంచే పాలన సాగిస్తున్నామని, అందరికీ అందుబాటులో రాష్ట్ర నడిబొడ్డున అమరావతిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ దుర్బుద్ధి ఏంటో ఇప్పుడు బయటపడిందని, జగన్ ఇప్పటికీ హైదరాబాద్ విడిచి రాలేదని ఎద్దేవా చేశారు. ప్యాలెస్ ఉంటే తప్ప జగన్ ఇక్కడ నివసించడని, ఎక్కడికి వెళ్లినా రాజ ప్రసాదాల్లోనే జగన్ బస చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. హైదరాబాద్ లో లోటస్ పాండ్‌ ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, పులివెందులలో మరో ప్యాలెస్, తాడేపల్లిలో ఇప్పుడు ఇంకో ప్యాలెస్ అంటూ ప్యాలెస్ లేకపోతే జగన్ ఉండలేడని అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ పూర్తయ్యే వరకు జగన్ హైదరాబాద్ వీడి రాలేదని వైసీపీ పేదల పార్టీ కాదని, ప్యాలెస్‌ల పార్టీ అని విమర్శించారు.