బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ మీద క్లారిటీ !

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలుగు రాష్ట్రాల్లో వార‌స‌త్వ రాజకీయాలు ఎక్కువే. ఇంకా చెప్పాలంటే తమ వారసులని రాజకీయాల్లోకి తేవడం తమ భాద్యత, హక్కుగా భావిస్తారు మన నేతలు. పార్టీలతో ప్రమేయంలేకుండా అందరు రాజ‌కీయాల్లో తమ తమ వారసులు ఉండాలని భావిస్తూ ఉంటారు. అయితే నారా బ్రాహ్మ‌ణి పొలిటికల్ ఎంట్రీ పై చాన్నాళ్ళ నుండి చ‌ర్చ జ‌రుగుతోంది. నంద‌మూరి వారింట పుట్టి పెరిగి, నారావారి ఇంట్లో అడుగుపెట్టింది బ్రాహ్మ‌ణి. బ్రాహ్మ‌ణి పుట్టినిల్లు, మెట్టినిల్లు తెలుగు ప్ర‌జ‌ల్లో మంచి పేరున్న కుటుంబాలే, రెండు రాజకీయ ప్రాధాన్యత ఉన్న కుటుంబాలే.

అయితే బ్రాహ్మ‌ణి రాజ‌కీయ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అన్న ఉత్సుకత తెలుగు తమ్ముళ్ళలోనే కాదు తెలుగు వారందరిలోను ఉంది. అదీ కాక చంద్ర‌బాబు రాజ‌కీయ వార‌సత్వం గురించి కూడా చ‌ర్చ జరుగుతూనే ఉంటుంది. చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ ను వచ్చే ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్ర నాయ‌కుడిగా నిలబెట్టాలని త‌లంపుతో ఉన్నార‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ దిశ‌గానే లోకేష్ కు చంద్ర‌బాబు ద‌శ‌ల‌వారిగా బాధ్య‌త‌ల‌ను అప్ప‌గిస్తున్నారు.

మొద‌ట కార్య‌కర్త‌లకు సంబంధించి వ్య‌వ‌హారాలు అప్పగించిన ఆయన తదుపరి ఎమ్మెల్సీని చేసి మంత్రిగా కూర్చోబెట్టారు. అయితే తాను భవిష్యత్తులో కేంద్ర రాజకీయాలకి వేల్లసి వస్తే లోకేష్ పార్టీ బాధ్యతలని అలాగే ప్రభుత్వ బాధ్యతలని నిర్వహించగలడా అనే అనుమానంతో నారా బ్రాహ్మణిని కూడా రాజకీయాల్లోకి తెచ్చి ఆమెకి పార్టీ పగ్గాలు అప్పగిస్తారని అంతా భావించారు అయితే బ్రహ్మణికి రాజకీయాల పట్ల ఆసక్తి లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు.

చంద్రబాబు నిన్న తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో బ్రహ్మణి రాజకీయాల్లోకి రావాలని, తెలంగాణలో టీడీపీ బాధ్యతలు తీసుకోవాలని సీఎంను తెలంగాణ నేతలు కోరారు. చంద్రబాబు నేతల కోరికను తోసిపుచ్చారు. ఆమెకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని చెప్పారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణకు, ఇతర కొందరు నేతలకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. తెలంగాణలో సమస్యలపై సీరియస్‌గా పోరాటం చేయాలని మెతకగా ఉంటే కుదరదని, అలసత్వం చేయవద్దని హితవు పలికారు.

అమాయకంగా ఉంటే పార్టీ మనుగడ కష్టమని, దైర్యంగా ఉండి అందరినీ కలుపుకుని పోవాలని రమణకు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. గ్రూప్ రాజకీయాలు మానివేసి అందరినీ కలుపుకొని పోవాలని సూచించారు. ఎవరికి సీట్లు ఇవ్వాలో నాకు తెలుసునని చెప్పారు. జాబితాను కూడా సిద్ధం చేశానన్నారు. ముందే టిక్కెట్లను ప్రకటిస్తానని చంద్రబాబు చెప్పారు. అలాగే తెలుగుదేశం మహానాడును 24న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.