జాతీయ ర‌హ‌దారుల దిగ్బంధ‌నానికి ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు

Chandrababu supports to National Highway Bund in Ap

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఏపీ ప్ర‌తిపక్షాలు పిలుపునిచ్చిన జాతీయ ర‌హ‌దారుల దిగ్బంధానికి అధికార టీడీపీ మ‌ద్ద‌తు ప‌లికింది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఏ పోరాటం చేసినా స‌హ‌క‌రిస్తామ‌ని, అయితే శాంతిభ‌ద్ర‌త‌ల‌కు మాత్రం భంగం క‌లిగించొద్ద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌తిపక్షాల‌ను కోరారు. కేంద్ర‌ప్ర‌భుత్వం సాయం చేసేవ‌ర‌కు టీడీపీ చేస్తున్న ఆందోళ‌న ఆగ‌ద‌ని స్ప‌ష్టంచేశారు. ఏమైనా ఫ‌ర్వాలేద‌ని, రాష్ట్రానికి న్యాయం జ‌రిగే వ‌రకు ప్ర‌య‌త్నాలు చేస్తాన‌ని చెప్పారు. చిన్న పిల్ల‌ల్ని ఎంత జాగ్ర‌త్త‌గా చూసుకుంటామో కొత్త రాష్ట్రాన్ని కూడా అదే విధంగా చూసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, అభివృద్ధిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ వెన‌క‌ప‌డ‌కూడ‌ద‌ని అన్నారు. వైసీపీ తీరుపై ముఖ్య‌మంత్రి మరోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఓ ప‌క్క వైసీపీ నేత‌లు ప్ర‌ధానిని క‌లుస్తూ విశ్వాసం ఉందంటున్నార‌ని, మ‌రోప‌క్క అవిశ్వాస తీర్మానం పెడుతున్నార‌ని విమ‌ర్శించారు. ఏ1, ఏ2 ఆర్థిక నిందితుల‌తో చ‌ర్చిస్తూ ప్ర‌ధాన‌మంత్రి ఏం సందేశం పంపిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. అటు జాతీయ ర‌హ‌దారుల‌ దిగ్బంధ‌నం కార్య‌క్ర‌మానికి జ‌న‌సేన కూడా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. గురువారం జ‌న‌సేన ఏపీ వ్యాప్తంగా న‌ల్ల బ్యాడ్జిల‌తో మౌనప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొంటుంద‌ని తెలిపింది. త‌క్ష‌ణ‌మే విభ‌జ‌న హామీలు నెర‌వేర్చ‌డం, ప్ర‌త్యేక హోదాపై ప్ర‌క‌ట‌న చేయాల‌న్న డిమాండ్ తో కాంగ్రెస్, వైసీపీ, వామ‌ప‌క్షాలు గురువారం బంద్ కు పిలుపునిచ్చాయి. కేంద్ర‌ప్ర‌భుత్వం అవిశ్వాస‌తీర్మానం కూడా చ‌ర్చకు రాకుండా కుట్ర‌లు ప‌న్నుతోంద‌ని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ మండిప‌డ్డారు. గురువారం ఉద‌యం 10 గంట‌ల నుంచి 12 గంట‌ల వ‌ర‌కు జాతీయ ర‌హ‌దారులు దిగ్బంధ‌నం చేస్తామ‌ని తెలిపారు.