Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భారత క్రికెట్ లో ఓ విచిత్ర పరిస్థితి ఉంది. ఎంత గొప్ప ఆటగాడైనా… జట్టుకు ఎన్ని విజయాలు సాధించిపెట్టినా… ఎన్ని రికార్డులు తిరగరాసినా… ఎప్పుడో ఒకప్పుడు ఆ ఆటగాన్ని బీసీసీఐ జట్టుకు భారంగా భావిస్తుంటుంది. అతడు సాధించిన ఘనతలన్నింటినీ పక్కనపెట్టి నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంది. ఆ ఆటగాడు తనంతట తానే జట్టులోనుంచి వెళ్లిపోయే పరిస్థితులు కల్పిస్తుంది. జట్టులోని ఇతర ఆటగాళ్లు సైతం ఈ విషయంలో బీసీసీఐకి సహకరిస్తారు. సాధారణ ఆటగాళ్లే కాదు… దిగ్గజాలు సైతం భారత క్రికెట్లో ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. భారత్ కు తొలి వరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్ ఇలాంటి పరిస్థితుల మధ్యే క్రికెట్ నుంచి నిష్క్రమించాడు. కెరీర్ చివరిరోజుల్లో ఫామ్ కోల్పోయి జట్టుకు భారంగా మారిన కపిల్ ను బీసీసీఐ ఇలాగే పక్కకుపెట్టింది. సునీల్ గవాస్కర్ సైతం ఈ తరహాలోనే రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇటీవలి విషయాలకొస్తే… భారత క్రికెట్లో కెప్టెన్సీకి కొత్త భాష్యం చెప్పి జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించిన సౌరవ్ గంగూలీ అవమానకరరీతిలోనే జట్టును వీడాడు. 2003 ప్రపంచకప్ లో టీమిండియాను ఫైనల్స్ కు చేర్చిన గంగూలీ కెరీర్ కు కొన్నేళ్ల పాటు ఢోకా ఉండదని అంతా భావించారు. కానీ మరో నాలుగేళ్లు గడిచేసరికి ఆయన పరిస్థితి తారుమారయింది. కెప్టెన్సీనే కాదు… ఒకానొకదశలో టీమిండియాలో స్థానం సైతం కోల్పోయిన గంగూలీ… 2007 ప్రపంచకప్ కు ఎలాగోలా కష్టపడి చోటు దక్కించుకున్నాడు. ఆ తర్వాత రెండేళ్లకే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్, కుంబ్లే వంటి దిగ్గజాలంతా ఇలా రిటైరయినవారే.
ఒక్క సచిన్ టెండూల్కర్ మాత్రమే 2011 వరల్డ్ కప్ గెలుచుకున్న రెండేళ్ల తర్వాత 2013లో గౌరవప్రదంగా రిటైర్ అయ్యాడు. ఇప్పుడిక భారత క్రికెట్లోనే అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా పేరుతెచ్చుకున్న మహేంద్రసింగ్ ధోనీ వంతు వచ్చింది. కెప్టెన్ గానూ, ఆటగాడిగానూ ధోనీ సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్ల కలను నిజం చేస్తూ 2011లో ధోనీ టీమిండియాకు వరల్డ్ కప్ అందించాడు. ఈ విజయం తర్వాత కొన్నాళ్ల పాటు ధోనీ హవా బాగానే సాగింది. అయితే టెస్టుల్లో వరుస ఓటములు ధోనీ కెప్టెన్సీపై ఒత్తిడి పెంచాయి. దీంతో వరల్డ్ కప్ సాధించిన నాలుగేళ్లలోపే ధోనీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది.
అయితే ఐపీఎల్, టీ20లు, వన్డేలు ఎక్కువ ఆడేందుకే ధోనీ టెస్టుల నుంచి రిటైర్ అయ్యాడని, ఇది సరైన నిర్ణయం కాదని విమర్శలు వచ్చాయి. టెస్టులకు రిటైర్మంట్ ప్రకటించిన తరువాత… ధోనీ 2015 వరల్డ్ కప్ కు నాయకత్వం వహించాడు. 2011 వరల్డ్ కప్ తర్వాత… భారత్ క్రికెట్లో విరాట్ కోహ్లీ శరవేగంగా ఎదిగి ధోనీకి పోటీగా నిలిచాడు. మొదట టెస్ట్ కెప్టెన్సీని, తరువాత వన్డే కెప్టెన్సీని ధోనీ నుంచి స్వీకరించాడు. 2015 వరల్డ్ కప్ ముగిసిన దగ్గరనుంచి కెప్టెన్సీ మార్పుపై డిమాండ్లు బయలుదేరాయి. టెస్టుల్లానే వన్డేల్లోనూ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పకుని కోహ్లీకి అప్పగించాలని మాజీలు పదే పదే డిమాండ్ చేశారు. జట్టుకు అతను సాధించిపెట్టిన విజయాలను అందరూ మర్చిపోయారు. ఒత్తిడి మధ్యే రెండేళ్లపాటు కెప్టెన్సీనీ నడిపించిన ధోనీ చివరకు ఈ ఏడాది ప్రారంభంలో పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి గుడ్ బై చెప్పి… జట్టులో సాధారణ ఆటగాడిగా కొనసాగాలని నిర్ణయించాడు.
అయితే కోహ్లీ, రవిశాస్త్రి కలిసి ధోనీకి వ్యతిరేకంగా పావులు కదిపి… అతను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకునేలా చేశారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఒకప్పుడు సీనియర్లు సెహ్వాగ్, గంభీర్, యువరాజ్ వంటి ఆటగాళ్ల విషయంలో ధోనీ ఎలా వ్యవహరించాడో… అదే పరిస్థితి తనకూ ఎదురయిందని సోషల్ మీడియాలో కామెంట్లు సాగాయి. కెప్టెన్సీ గొడవ ముగియడంతో ఇక ఇప్పుడు జట్టులో ధోనీని కొనసాగించడింపై విమర్శలు వినపడుతున్నాయి. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ధోనీ జట్టులో నిలకడగా రాణిస్తున్నప్పటికీ… ఆయన ఇక అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికితే మంచిదన్న భావనను పరోక్షంగా మాజీలు వ్యక్తపరుస్తున్నారు. బయటకు మాత్రం కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి ధోనీకి మద్దతు పలికినట్టు కనిపిస్తున్నా… అంతర్గతంగా వారి అభిప్రాయమూ ఇదేనన్న వాదన వినిపిస్తోంది. జట్టులో ధోనీకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నయనే విషయం ఇప్పటిదాకా బయటకు పొక్కలేదు కానీ… సీనియర్లకు భారత జట్టులో దక్కే గౌరవం ఎలా ఉంటుందో అందరికీ తెలిసినదే.
ఈ విషయం గమనించే కాబోలు… ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్ క్రిస్ట్ భారత్ కు ఓ సలహా ఇచ్చాడు. మహేంద్ర సింగ్ ధోనీ అనుభవం అమూల్యమయిందని, దాన్ని తక్కువ చేయొద్దని గిల్ క్రిస్ట్ సూచించాడు. ధోనీ అనుభవం నుంచి ఎంత లబ్ది పొందుతున్నామో భారత జట్టు తెలుసుకోలేకపోతోందని విమర్శించాడు. ధోనీ అనుభవం ద్వారా భారత్ తాను అనుకుంటున్న దాని కంటే ఎక్కువ ప్రయోజనమే పొందుతోందని, అక్కడున్నవాళ్లు ధోనీ అనునభవం, స్థిరత్వంతో కలుగుతున్న ప్రయోజనాన్ని తక్కువ అంచనావేస్తున్నారేమోనని అనిపిస్తోందన్నాడు గిల్ క్రిస్ట్. ధోనీ ఇప్పటికీ 3 నుంచి 7వ స్థానం వరకూ ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడని, భారత జట్టుకు ధోనీ అవసరం చాలా ఉందని, జట్టు నుంచి అతను వెళ్లిపోతే ఆ స్థానాన్ని ఎవరూ పూడ్చలేరని గిల్ క్రిస్ట్ విశ్లేషించాడు. విరాట్ కోహ్లీ, మిగతా ఆటగాళ్ల దూకుడు, ఆటపై వారికున్న మోజు తనకిష్టమని, వాళ్లకు ఓ అనుభవజ్ఞుడు, తెలివైన వాడు తోడైతే సమతూకం వస్తుందని గిల్ క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. మరి ధోనీని జట్టుకు భారంగా భావిస్తున్న వాళ్లు గిల్ క్రిస్ట్ వ్యాఖ్యల తర్వాతైనా తమ ఆలోచన మార్చుకుంటారో లేదో చూడాలి.