ఇక చైనా వస్తువులు నిషేదం : కేంద్రమంత్రి

భారత్- చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో దేశమంతా ఆందోళన నెలకొంది. ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు వ్యాపాల సంబంధాలు విపరీతంగా జరిగేవి. అయితే ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే.. చైనా వస్తువులను భారతీయులు కొనుగోలు చేయకూడదని తీవ్రంగా ప్రచారం జరుగుతుంది. దీంతో ఇప్పటికే చైనా నుంచి దిగుమతులను తగ్గించాలని నిర్ణయించిన ఇండియా, అందుకు తగిన విధి విధానాలను త్వరలోనే ప్రకటించనుంది. ఇదే విషయాన్ని స్వయంగా వెల్లడించిన కేంద్ర ఆహార, వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్, ఈ విషయంలో ప్రజలే చైనా ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ప్రజలనుంచి భారీ స్పందన రావాలని.. అలా వస్తేనే చైనాకు బుద్ధి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

అదేవిధంగా ప్రభుత్వం తరఫు నుంచి కూడా చైనా దిగుమతులను ఒక్కొక్కటిగా తగ్గిస్తామని వెల్లడించారు. అలాగే.. ఇండియాకు తొలి శత్రువు చైనాయేనని.. అప్పట్లో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఉన్న జార్జ్ ఫెర్నాండెజ్ అన్న మాటల్ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని కూడా ఆయన కోరారు. ఇంకా మనకు ప్రమాదకరంగా మారిన పొరుగు దేశం నుంచి వస్తు ఉత్పత్తులను కొనాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా ‘చైనా ఇలాంటా దుశ్చర్యకు పాల్పడి మన సైనికులను అమరులను చేసిందంటే.. ద్వైపాక్షిక చర్చల కంటే  వారి వస్తువులను కొనకుండా ఉంటేనే ఆ దేశానికి మరింత నష్టం. భారతీయులు తమ ఇళ్లలో పూజించే వినాయకుడి విగ్రహాలను. చైనా నుంచి ఎందుకు తెచ్చుకోవాలి?’ అంటి ఆయన వ్యాఖ్యనించారు.

 అంతేకాకుండా ఇప్పటికే భారత వస్తువుల క్వాలిటీని పెంచేందుకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిబంధనలను కఠినతరం చేసిందని తెలిపారు. అతి త్వరలోనే కొత్త నిబంధనలు, నియంత్రణా విధానాన్ని దిగుమతులపై ప్రకటించనున్నామని రామ్ విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. ఈ నిబంధనలు అమలులోకి వస్తే, చౌక, తక్కువ క్వాలిటీతో కూడిన దిగుమతులకు అడ్డుకట్ట పడుతుందని ఆయన వివరించారు. ఇండియాలో ప్రస్తుతం 25 వేలకు పైగా వస్తు ఉత్పత్తులకు బీఐఎస్ నిర్ధారణ ఉందని, కొత్త నిబంధనలు అమలులోకి వస్తే, క్వాలిటీతో కూడిన మరిన్ని ఉత్పత్తులు ఇండియాలోనే లభిస్తాయని రామ్ విలాస్ పాశ్వాన్ వివరించారు. చివరగా ‘ప్రస్తుతమున్న నియమ నిబంధనల ప్రకారం మన బాస్మతి బియ్యం ఎగుమతులను వెనక్కు పంపుతున్నారు. కానీ.. వారి నుంచి వచ్చే నాణ్యతలేని ఉత్పత్తులు ఇండియాలో విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకూ ఇండియాలో కఠినమైన క్వాలిటీ కంట్రోల్ విధానాలు లేవు. ఈ పరిస్థితి అతి త్వరలోనే మారనుంది’ అంటూ రామ్ విలాస్ పాశ్వాన్ వివరించారు.