చైనా వెన్నులో వణుకు… చైనా నుంచి పలు కంపెనీలు బయటకు..

కరోనా దెబ్బకు ప్రపంచం విలవిలలాడిపోతుంది. దాదాపు అన్ని దేశాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే లక్ష మందికి పైగా మృత్యవాతపడ్డారు. ఇటలీ, అమెరికా, స్పెయిన్ వంటి దేశాలలో మరణ మృదంగం ఇంకా మోగుతూనే ఉంది. అమెరికాలో ప్రతిరోజు రెండు వేల మంది చనిపోతున్నారు. నిన్నా మొన్నటివరకు కరోనా ప్రభావం తమ మీద అంతగా లేదనుకున్న సింగపూర్, జపాన్ వంటి దేశాలు కూడా తాజాగా కరోనా ధాటికి అతలాకుతలమైపోతున్నాయి. దీంతో విసిగి వేసారిన జపాన్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. చైనాలో తన కంపెనీలకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. గతంలో చైనాలో విద్యుత్తు రేట్లు తక్కువగా ఉండడం, మానవ వనరులు అంటే.. శ్రామికులు ఎక్కువగా లభ్యం కావడం, అలాగే.. కూలీల ఖర్చు కూడా తక్కువగా ఉండటంతో పాటు శ్రామిక చట్టాలు అంత పటిష్టంగా లేకపోవడంతో చైనాలో భారీగా తన కంపెనీలను స్థాపించింది. తాజాగా కరోనా నేపథ్యంలో అక్కడ కంపెనీలు స్థాపించిన పెట్టుబడిదారులకు బంపర్ ఆఫర్ ఇస్తోంది జపాన్.

అదేమంటే.. చైనాలో తాము గతంలో ఏర్పాటు చేసిన కంపెనీలను అక్కడి నుండి తీసివేసి తన దేశంలో కానీ.. ఇండియాలో కానీ ఏర్పాటు చేయాలని సూచిస్తోంది. కేవలం సూచనలకే పరిమితం కాకుండా ఏకంగా అలాంటి కంపెనీలకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. అలా ఏర్పాటు చేసిన కంపెనీలకు ఏకంగా వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తామని కూడా ప్రకటిస్తోంది. ఇప్పటికే ఇరవై వేలకోట్ల రూపాయల ప్యాకేజ్ అందించింది. అంతేకాకుండా ఇది సరిపోదంటే దీనికి ఐదింతలు ఇస్తామని కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. జపానికి.. చైనాపై ఆగ్రహానికి అసలు కారణం వూహాన్లో కరోనా వైరస్ అంతగా విస్పోటనం చెంది వేలాది మంది చనిపోయినా గానీ.. ఆ విషయాన్ని రహస్యంగా ఉంచి ప్రపంచ నాశనానికి కారణం కావడమే. అంతేకాదు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తాను ఎలా కరోనాని కంట్రోల్ చేయాలో అనే విషయాన్ని కూడా బయట పెట్టక పోవడం చూస్తుంటే కావాలని ఇదంతా చేస్తుందా అనే అనుమానాలకు తావిస్తుంది. అంతేకాకాకుండా అక్కడి మీడియాలో ఎక్కడా చైనాలోని వూహాన్ లో కరోనా సృష్టించిన విధ్వంసంపై కనీసం వార్తలు బయటకు రాకపోవడం కూడా పలు అనుమానాలకు దారితీస్తుంది.

కాగా ఇప్పటివరకు చైనాలో కంపెనీలు పెడితే అక్కడి శ్రామికుల తిరుగుబాట్లు ఏవీ బయటికి రావని భావించారు. అందుకే కంపెనీలు ఎక్కువగా స్థాపించారు. తాజాగా కరోనాతో ప్రపంచ మానవాళికి చేటు వచ్చేలా ఉంది. దీంతో అక్కడి నుండి భారీగా తమ కంపెనీలను బయటకు రప్పించాలని ప్లాన్ చేస్తుంది జపాన్. అలాగే.. ఈ కంపెనీలను ఇండియాలాంటి దేశాలలో ఏర్పాటు చేస్తే తమకు భారీ లాభాలు చేకూరుతాయని అంచనా వేస్తోంది జపాన్. ఇండియా వంటి ప్రజాస్వామ్య దేశాలలో పారదర్శకత ఎక్కువగా ఉండడం, మీడియా బలంగా ఉండటం, ప్రతిపక్షాల భయంతో అధికార పార్టీలో దేనినీ సీక్రెట్ గా ఉంచే ఛాన్స్ లేకపోవడంతో ఇండియా వంటి దేశం అయితేనే మంచిదని జపాన్ లెక్క లు వేస్తోంది. అందుకే చైనా నుంచి తరలి వచ్చే కంపెనీలన్నింటినీ ఏకమొత్తంగా ఇండియాకి తరలించాలన్న యోచనలో ఉంది. ఇప్పటికే ప్యాకేజ్ లు కూడా ప్రకటించడం విశేషం. జపాన్ నిర్ణయంతో చైనా వెన్నులో వణుకు పుడుతోంది. ఇదే జరిగితే కొన్ని వందల చిన్న మీడియం స్థాయి కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెట్టటానికి రెడీ కావడం గ్యారెంటీ. అయితే ఇలాంటి కీలక సమయంలో చైనా ఎలా చేస్తుంది అనేది వేచి చూడాలి.