‘బేబీ’ వైష్ణవిని ప్రశంసలతో ముంచెత్తిన చిరూ…

baby movie
baby

ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్ ప్రధాన పాత్రలతో సాయి రాజేష్ దర్శకత్వం లో విడుదలైన చిత్రం బేబీ . అనుకున్న దాని కంటే ఘన విజయం సాధించడం తో మెగా ఈవెంట్ పేరుతో విజయోత్సవ సభ హైదరాబాద్ లో జరిగింది. ఇటీవల కాలంలో విడుదలైన తెలుగు సినిమాలలో, చాలా వేగంగా భారీ వసూళ్లను సాధించిన సినిమాలలో ‘బేబి’ ఒకటిగా నిలిచింది. తక్కువ బడ్జెట్ తో నిర్మితమై, స్టార్ హీరోల సినిమాలతో సమానంగా పరుగులు తీసిన సినిమాగా ఇది నిలిచింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులంతా వైష్ణవి చైతన్య నటనకి ఎక్కువ మార్కులు వేశారు.

మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ సినిమా విజయోత్సవ వేడుక ను ‘మెగా కల్ట్ సెలబ్రేషన్స్’ పేరుతో నిర్వహించారు. ఈ వేదికపై ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరిని చిరంజీవి ఎంతగానో అభినందించారు. ఈ సినిమా దర్శక నిర్మాతలను .. హీరోలుగా నటించిన ఆనంద్ దేవరకొండను .. విరాజ్ ను మెచ్చుకుంటూనే, వైష్ణవి చైతన్య నటనను ప్రశంసించారు.

“వైష్ణవి పాత్ర .. ఆమె నటన ఈ సినిమాను నిలబెట్టేసింది. అటు గ్లామరస్ గాను.. ఇటు డీగ్లామర్ గాను .. ఆమె కనిపించిన తీరు ,వైవిద్యంను ఆమె చూపించిన విధానం గొప్పగా అనిపించాయి. చాలా సన్నివేశాలను చూస్తూ, నటనలో ఈ అమ్మాయికి చాలా పరిణతి ఉందని నేను అనుకున్నాను. ఇదే ఆమె ఫస్టు సినిమా అని తెలిసి షాక్ అయ్యాను.

ఈ సందర్భంలో నేను ఒక మాట చెబుతున్నాను .. నా మాట వ్యర్థం కాదు. మనకి సహజనటి జయసుధ గారు ఉన్నారు. ఎలాంటి పాత్రనైనా ఆమె ఎంతో అద్భుతంగా చేస్తారు. ఆమెను తలపిస్తూ ఆ స్థానంలోకి ఎవరు వస్తారా అనుకునేవాడిని. ఆ లక్షణాలు నాకు వైష్ణవిలో కనిపించాయి. ఆమె ఫ్యూచర్ నాకు కనిపిస్తోంది. ఎంతో సహజంగా నటించిన వైష్ణవికి మంచి భవిష్యత్తు ఉంది” అంటూ చెప్పుకొచ్చారు.