మోదీకి లేఖ రాసిన ముఖ్యమంత్రి

మోదీకి లేఖ రాసిన ముఖ్యమంత్రి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ.. నిధుల విడుదల విషయంలో జోక్యం చేసుకోవాలని ఏడు పేజీల లేఖలో ప్రస్తావించారు. ఇరిగేషన్, భూ సేకరణ, పునరావాసాలకు కూడా నిధులు ఇవ్వాలని.. 2014 ఏప్రిల్ 29న కేబినెట్ చేసిన తీర్మానాన్ని లేఖలో జగన్ ప్రస్తావించారు.. ఆలస్యమయ్యే కొద్ది ప్రాజెక్ట్ వ్యయం పెరుగుతుందన్నారు.. రూ.47,725 కోట్లు విడుదల చేయాలని కోరారు. విభజన చట్టంలో కూడా ఇదే ఉందని ప్రస్తావించారు. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్‌కి రూ.28,191 కోట్లు ఖర్చు అవుతుందన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ కట్టాల్సిన పూర్తి బాధ్యతే కేంద్రానిదే.. పునరావాసం కూడా కేంద్రానిదే అన్నారు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. విభజన చట్టంలో పోలవరాన్ని కేంద్రమే నిర్మిస్తుందన్నారని.. వైఎస్సార్‌ హయాంలో చేసిన ప్రాజెక్ట్ పనులనే చంద్రబాబు తనవిగా చెప్పుకున్నారన్నారు. నిధులు, ఇతర అంశాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి జగన్ ప్రధానికి లేఖ రాశారన్నారు.

పోలవరం విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని.. 2021 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ ఖచ్చితంగా కట్టి తీరుతామన్నారు మంత్రి. పోలవరం విషయంలో రాజీ పడుతున్నారని సీఎం జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.. రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో రాజీనే లేదన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని మోదీని కలుస్తారని.. ఈ లేఖపై ప్రధాని సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నాను అన్నారు.