కాఫీ కింగ్ సిద్ధార్థ ఆత్మహత్య…కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం

autopsy report: Coffe day Siddartha suicide

మొన్న సాయంత్రం నుంచి కనిపించకుండాపోయిన కేఫ్ కాఫీడే అధినేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అల్లుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండు రోజుల కిందట అదృశ్యమైన ఆయన నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక జాలరి ఒకరు ఇచ్చిన సమాచారంతో గాలించగా బుధవారం ఉదయం సిద్ధార్థ మృతదేహం నేత్రావతి నదిలో లభ్యమైంది.

సోమవారం సాయంత్రం మంగళూరుకు 350 కిలోమీటర్ల దూరంలోని తొక్కుట్టు ప్రాంతంలో నేత్రావతి నది వంతెన వద్ద ఆయన అదృశ్యమయ్యారు. వ్యాపార లావాదేవీల్లో తీవ్ర ఇబ్బందుల్లో ఇరుక్కుపోయానని, ఇన్వెస్టర్లు, ఆదాయపు పన్ను అధికారులు ఒత్తిడి భరించలేకపోతున్నాని ఓ లేఖ రాసిపెట్టి సిద్ధార్థ తన ఇంటి నుంచి వెళ్లిపోయారు.

ఆ తర్వాత అదృశ్యమైన సిద్ధార్థ ఆచూకీ కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు నేత్రావతి నది పరిసరాల్లో దాదాపు 30 గంటల పాటు గాలించారు. ఎట్టకేలకు హోగే బజార్ ప్రాంతంలోని నేత్రావతి నదిలో ఆయన శవమై కనిపించినట్టు పోలీసులు తెలిపారు. అప్పటికే సిద్ధార్థ మృతదేహం కుళ్లిపోయిందని పోలీసులు వివరించారు. పోస్ట్‌మార్టం కోసం వెన్‌లాక్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.